నాలుక మడతేసిన ట్రంప్ సర్కారు..ఇరాన్ తో చేస్తున్నది యుద్ధమే కాదట
ఒక దేశం కాదు రెండు దేశాలు కానీ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా అడ్డగోలు నిర్ణయాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు.. ఎప్పటిలానే తాను చేసే పనుల్ని అడ్డదిడ్డంగా సమర్థించుకోవటం తెలిసిందే.;
ఒక దేశం కాదు రెండు దేశాలు కానీ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా అడ్డగోలు నిర్ణయాలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ట్రంప్ సర్కారు.. ఎప్పటిలానే తాను చేసే పనుల్ని అడ్డదిడ్డంగా సమర్థించుకోవటం తెలిసిందే. అలాంటి తీరునే మరోసారి ప్రదర్శించింది. కొద్ది నెలలుగా ఇరాన్ తో చేస్తున్నది యుద్ధమే కాదని.. చిన్నపాటి సైనిక చర్యగా పేర్కొంటూ నాలుక మడతేసిన వైనం చూస్తే.. విస్మయానికి గురి కావాల్సిందే.
అమెరికాలోని చట్టాల ప్రకారం ఆ దేశ అధ్యక్షుడు ఏ దేశం మీద యుద్ధం మొదలు పెట్టినా.. అరవై రోజుల్లోపు అమెరికా చట్టసభ కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిందే. లేదంటే.. యుద్ధాన్ని ఆపేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనకు అనుగుణంగా చూసినప్పుడు.. ఇరాన్ తోయుద్ధం మొదలు పెట్టిన 60 రోజులు అవుతున్న వేళ.. కాంగ్రెస్ ఆమోదం లేని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము చేస్తున్నది యుద్ధమే కాదని.. చిన్నపాటి సైనిక చర్యగా పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్ పై ట్రంప్ సర్కారు యుద్ధం ప్రకటించటం.. దీంతో యావత్ ప్రపంచం ఆగమాగం కావటం తెలిసిందే. యుద్ధం మొదలైన నాటి నుంచి శుక్రవారం నాటికి 60 రోజులు పూర్తి అవుతున్న వేళ.. కాంగ్రెస్ ఆమోదం లేని నేపథ్యంలో ట్రంప్ సర్కారు తాజా వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా చెప్పాలి.
తాజాగా అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ జాన్సన్ మాట్లాడుతూ.. ట్రంప్ సర్కారు యుద్ధమే చేయటం లేదని.. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొనటం దీనికి నిదర్శనం. అంతేకాదు.. ఇరాన్ తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ.. అరవై రోజుల్లోగా చట్టసభ ఆమోదం పొందాలన్న నిబంధన తమకు వర్తించదంటూ ట్రంప్ కు సరిసాటిగా నాలుక మడత బెట్టేశారు రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. ఈ వాదనను ప్రతిపక్ష డెమొక్రాట్ సెనేటర్లు తిరస్కరిస్తున్నారు.
యుద్ధాన్ని ఆపేసి బలగాల్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఇకపై.. ఇరాన్ తో యుద్ధం కంటిన్యూ చేయాల్సి వస్తే.. భీకరస్థాయిలో విరుచుకుపడేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ సిద్ధమవుతోంది. ఇందుకు డార్క్ ఈగిల్ హైపర్ సోనిక్ క్షిపణులను వినియోగించేందుకు వీలుగా అనుమతులు కోరటం గమనార్హం. హోర్మూజ్ జలసంధి దిగ్భంధంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్.. యుద్ధం ముగించే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో మధ్యవర్తి పాక్ చేత తన తాజా ప్రతిపాదనల్ని ఇరాన్ పంపగా..ట్రంప్ దీనిపై స్పందిస్తూ.. వారు పంపిన ప్రతిపాదనలు తనకు నచ్చలేదన్నారు. అలాంటి ప్రతిపాదనల్ని తాను అంగీకరించే అవకాశమే లేదన్న ఆయన.. ఇరాన్ ప్రతినిధులతో ఫోన్ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇరాన్ లో కీలక నాయకత్వం అంతా తుడిచిపెట్టుకుపోయిందని.. ప్రభుత్వాధినేత ఎవరో వారికే తెలీని గందరగోళంలో వారున్నట్లుగా ట్రంప్ పేర్కొనటం గమనార్హం.
ఇదిలా ఉంటే మరోవైపు ఇరాన్ ప్రభుత్వ నేతల్లో విభేదాలు పెరిగినట్లుగా చెబుతున్నారు. విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీని తొలగించేందుకు అధ్యక్షుడు పెజెష్కియాన్.. పార్లమెంట్ స్పీకర్లు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఐఆర్ జీసీకి అనుకూలంగా విదేశాంగ మంత్రి వ్యవహరించటమే కారణంగా చెబుతున్నారు. ఇటీవల అమెరికాతో జరిపిన చర్చల సందర్భంలోనూ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి.. ఐఆర్ జీసీ వాదనలకు అనుకూలంగా వ్యవహరించిన వైనాన్ని ప్రస్తావిస్తున్నారు. విదేశాంగ మంత్రి తీరుతో పార్లమెంట్ స్పీకర్ తో పాటు ఇతర నేతలు కూడా సంతోషంగా లేరని.. ఆయన్ను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు.