సర్ ప్రైజ్ : బర్గర్ ఆర్డర్ చేసి, డెలివరీ తీసుకున్న ట్రంప్

సాధారణంగా దేశాధ్యక్షులకు అవసరమైన ఆహారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ వైట్ హౌస్ వంటగదిలోనే సిద్ధమవుతుంది.;

Update: 2026-04-14 05:17 GMT

అమెరికా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసే డొనాల్డ్ ట్రంప్ మరోసారి వినూత్న రీతిలో వార్తల్లో నిలిచారు. విధానపరమైన నిర్ణయాలను కేవలం ఫైళ్లకే పరిమితం చేయకుండా వాటి ఫలితాలను సామాన్యుల సాక్షిగా ప్రపంచానికి చాటిచెప్పడంలో ఆయన శైలే వేరు. తాజాగా తన ప్రతిష్టాత్మక ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ విధానం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వైట్ హౌస్ వేదికగా చేసిన ఒక ఆసక్తికర ప్రయోగం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.




 


- వైట్ హౌస్‌కు బర్గర్ డెలివరీ: ఒక వినూత్న ప్రచారం

సాధారణంగా దేశాధ్యక్షులకు అవసరమైన ఆహారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ వైట్ హౌస్ వంటగదిలోనే సిద్ధమవుతుంది. కానీ ట్రంప్ తన విధానం వల్ల సామాన్య కార్మికులకు చేకూరిన లబ్ధిని ప్రత్యక్షంగా చూపించాలనుకున్నారు. ఇందులో భాగంగా ఆయన స్వయంగా మెక్ డొనాల్డ్ నుంచి బర్గర్ ఆర్డర్ చేశారు. ఈ ఆర్డర్‌ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరనేది ఈ ఘటనలో అత్యంత కీలకమైన అంశం.

‘డోర్‌డాష్ గ్రాండ్మా’ రాకతో పెరిగిన ప్రాధాన్యత

ఈ ఆర్డర్‌ను డెలివరీ చేసే బాధ్యతను షారోన్ సిమ్మన్స్ అనే వృద్ధురాలు స్వీకరించారు. ఆమె కేవలం ఒక డెలివరీ ఏజెంట్ మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో ‘డోర్‌డాష్ గ్రాండ్మా’గా పాపులర్ అయ్యారు. వయస్సు పైబడినప్పటికీ విశ్రాంతి తీసుకోకుండా ఎంతో నిబద్ధతతో డెలివరీ సేవలు అందిస్తున్న ఆమెను ఓవల్ ఆఫీస్‌లోకి ఆహ్వానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక దేశాధ్యక్షుడు స్వయంగా డెలివరీ కార్మికురాలిని కలిసి.. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం అరుదైన దృశ్యంగా నిలిచింది.

$11,000 అదనపు ఆదాయం.. విధానం సాధించిన విజయం

సంభాషణ సందర్భంగా షారన్ సిమన్స్ తన పని అనుభవాలను ట్రంప్‌తో పంచుకున్నారు. ప్రధానంగా ‘నో ట్యాక్స్ ఆన్ టిప్స్’ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత తన ఆర్థిక పరిస్థితిలో వచ్చిన మార్పును వివరించారు. ఆమె మాటల్లోనే చెప్పాలంటే టిప్స్‌పై పన్ను మినహాయింపు లభించడం వల్ల గత ఏడాది కాలంలో ఆమెకు సుమారు $11,000 (భారత కరెన్సీలో సుమారు ₹9 లక్షలకు పైగా) అదనపు ఆదాయం మిగిలింది. గతంలో టిప్స్‌లో కొంత భాగం పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళ్లేదని, ఇప్పుడు ఆ మొత్తం నేరుగా తనకే దక్కుతోందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సేవా రంగంలో పనిచేసే వెయిటర్లు, డ్రైవర్లు, డెలివరీ బాయ్స్‌కు ఇది గొప్ప వరమని ఆమె పేర్కొన్నారు.

$100 టిప్ ఇచ్చి ఆశ్చర్యపరిచిన ట్రంప్

షారన్ చెప్పిన వివరాలతో సంతృప్తి చెందిన ట్రంప్ తన విధానం వల్ల పేద , మధ్యతరగతి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాయని ఆనందం వ్యక్తం చేశారు. తన పద్ధతికి నిదర్శనంగా ఆయన షారన్ సిమన్స్‌కు స్వయంగా $100 టిప్ ఇచ్చి అభినందించారు. ఇది కేవలం ఒక బహుమతి మాత్రమే కాదు, టిప్స్ అనేవి కార్మికుల హక్కు అని చాటిచెప్పే సంకేతం.

రాజకీయ సందేశం.. సామాజిక చర్చ

ఈ సంఘటన వెనుక బలమైన రాజకీయ సందేశం దాగి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో సేవా రంగం అతిపెద్దది. లక్షలాది మంది కార్మికులు టిప్స్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఓట్లను ఆకర్షించడమే కాకుండా వారి కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని ట్రంప్ భావిస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయ విమర్శకులు సైతం ట్రంప్ అనుసరించిన ఈ ప్రచార పద్ధతిని చూసి ఆశ్చర్యపోతున్నారు. సామాన్యులతో నేరుగా మమేకమవ్వడం ద్వారా తన విధానాలు కేవలం ప్రకటనలు కావని.. అవి క్షేత్రస్థాయిలో మార్పు తెస్తున్నాయని నిరూపించడంలో ట్రంప్ మరోసారి విజయం సాధించారు.

Tags:    

Similar News