భారతీయులను వద్దంటున్న ట్రంప్: ఎవరికి నష్టం?
ట్రంప్ ఎప్పటిలాగే "అమెరికా ఫస్ట్" అనే తన నినాదాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. H1B వీసాలపై అతను గతంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై ముఖ్యంగా భారతీయులపై తన వ్యతిరేక భావనలను మరోసారి బయటపెట్టారు. ఇటీవల జరిగిన ఒక AI సమ్మిట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికాలోని భారతీయ టెకీల భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారి తీశాయి. "అమెరికన్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపాలి. స్థానిక ఉద్యోగులను ప్రోత్సహించాలి" అన్న ట్రంప్ మాటలు వివాదాస్పదంగా మారాయి.
-ట్రంప్ వ్యాఖ్యల వెనుక ఉన్న ఆలోచన
ట్రంప్ ఎప్పటిలాగే "అమెరికా ఫస్ట్" అనే తన నినాదాన్ని నెరవేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. H1B వీసాలపై అతను గతంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకోవడం తెలిసిందే. ఈసారి కూడా టెక్ కంపెనీలు భారతీయులను పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో నియమించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ ప్రకటనకు ప్రధాన కారణాలున్నాయి. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. చైనా, ఇండియా లాంటి దేశాలతో వ్యాపార పోటీలో అమెరికా తన స్థానం కోల్పోతుందని ఆయన భయపడుతున్నారు. వలస వ్యతిరేక మంత్రంతో రాబోయే ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవాలనేది ఆయన రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది.
ప్రస్తుతం అమెరికా ఐటీ రంగంలో దాదాపు 40% పైగా ఉద్యోగులు భారతీయులే కావడం విశేషం. ట్రంప్ సూచించినట్టుగా భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తే లేదా వీసా పరిమితులు మరింత కఠినతరం చేస్తే, దాని ప్రభావం అమెరికాపై పడుతుంది.
1. అమెరికన్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం
భారతీయుల నైపుణ్యం, శ్రమ, ఆలోచనా ధోరణి అమెరికన్ టెక్ రంగాన్ని నిలబెట్టే శక్తిగా ఉన్నాయి. వారి సహాయం లేకుండా ప్రాజెక్టుల వేగం తగ్గిపోతుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ పని చేసే ప్రతిభను అమెరికన్ కంపెనీలు కోల్పోతాయి.
2. స్టార్టప్‌లు, టెక్ ఇన్నోవేషన్ మందగిస్తుంది
ఆవిష్కరణలకు అవసరమైన బహుళ సాంస్కృతిక దృక్పథం దెబ్బతింటుంది. భారత్ నుంచి వచ్చిన అనేకమంది ఇంజనీర్లు, సీఈఓలుగా ఎదిగిన ఉదాహరణలు ఉన్నాయి. సుందర్ పిచై (గూగుల్ సీఈఓ), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈవో) లాంటి వారు లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవచ్చు.
3. భారతీయులకు స్వదేశంలో అవకాశాలు
ఇది కొంతవరకు భారతదేశానికి ప్రయోజనకరంగా మారవచ్చు. అమెరికా నుండి బెదిరింపులు వస్తే, ప్రతిభావంతులైన యువత భారతీయ స్టార్టప్‌లు, కంపెనీల వైపు మొగ్గు చూపుతారు. ఇది దేశీయ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.
4. గ్లోబల్ ఐటీ ఎకానమీపై ప్రభావం
భారతీయుల వలసలతో ప్రపంచ ఐటీ రంగానికి సరఫరా అయ్యే నిపుణుల సంఖ్య పెరిగింది. వారి రాక నిలిచిపోతే అమెరికా మాత్రమే కాక, ప్రపంచవ్యాప్త ప్రాజెక్టుల వేగం కూడా పడిపోతుంది.
ట్రంప్ వ్యాఖ్యలు వాస్తవానికి పూర్తిగా అమలు కాకపోవచ్చు. ఎందుకంటే అమెరికా కంపెనీలు ప్రతిభ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేస్తాయి, జాతీయత ఆధారంగా కాదు. అయినప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలు వలసదారుల్లో ఆందోళన కలిగించడం ఖాయం. భారత యువత తమ ప్రతిభతో శ్రమతో ప్రపంచాన్ని ఆకర్షించింది. ఎవరు అడ్డుపడ్డా, తమదైన మార్గాన్ని తయారుచేసుకునే శక్తి మన యువతకు ఉంది. కానీ, రాజకీయ వ్యాఖ్యలు గ్లోబల్ మైగ్రేషన్ పాలసీలపై ఎంత ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.