కాల్చి చంపినా సరే.. ఇమ్మిగ్రేషన్ అధికారినే సమర్థించిన ట్రంప్
ట్రంప్ కర్కశుడిగా మారిపోయాడు. అమెరికాలో నిరసనకారుల్లో ఒకరిని చంపిన పోలీసును వెనకేసుకొచ్చాడు. ఆమె చేసింది రైట్ అని అంటున్నారు.;
ట్రంప్ కర్కశుడిగా మారిపోయాడు. అమెరికాలో నిరసనకారుల్లో ఒకరిని చంపిన పోలీసును వెనకేసుకొచ్చాడు. ఆమె చేసింది రైట్ అని అంటున్నారు. ఇతర దేశస్థులనే కాదు సొంత దేశస్థుల విషయంలోనూ ట్రంప్ వైఖరిపై అమెరికాలో నిరసనలు మొదలయ్యాయి..
అమెరికాలోని మిన్నియాపాలిస్ లో బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసన ప్రదర్శనల్లో చోటుచేసుకున్న కాల్పుల్లో 37 ఏళ్ల రెనీ నికోల్ గుడ్ మృతి చెందారు. ఈ ఘటనపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. అధికారి చర్యను సమర్థించడం చర్చనీయాంశమైంది. దీనిపై దేశమంతా నిరసనలు తీవ్రతరమయ్యాయి.
అసలేం జరిగింది?
ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు చేపట్టిన ఆపరేషన్‌కు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేపట్టారు. ఆ సమయంలో రెనీ నికోల్ గుడ్ తన వాహనంతో అధికారుల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిందని సమాచారం. ఆత్మరక్షణ కోసం అక్కడే ఉన్న ఒక అధికారి కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు.
ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
ఈ ఘటనపై డోనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ బాధితురాలి ప్రవర్తనను తప్పుబట్టారు. ‘‘ఆమె ప్రవర్తన అత్యంత దారుణంగా ఉంది. అధికారులను వాహనంతో తొక్కించే ప్రయత్నం చేయడం వల్లే ఈ అవాంఛనీయ ఘటన జరిగింది’’ అని ఆయన పేర్కొన్నారు. అధికారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నప్పుడు వారు స్పందించక తప్పదని.. ఇది ఆత్మరక్షణలో భాగంగానే జరిగిందని ఆయన సమర్థించారు. ప్రసంగం సందర్భంగా దీనికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా ప్రదర్శించారు. అయితే ఇలా ప్రాణాలు పోవడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
మద్దతుగా నిలిచిన జేడీ వాన్స్
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ట్రంప్ వాదనతో ఏకీభవించారు. రెనీ నికోల్ గుడ్ ప్రవర్తనను ఆయన వామపక్ష తీవ్రవాద ధోరణి గా అభివర్ణించారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో అధికారి తీసుకున్న నిర్ణయం సరైనదేనని ఆయన మద్దతు పలికారు.
దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు
ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇమ్మిగ్రేషన్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న సుమారు 1,500 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారుల మితిమీరిన చర్యలపై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని, మానవ హక్కుల ఉల్లంఘనను అరికట్టాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఈ ఘటన ఇమ్మిగ్రేషన్ విధానాలపై చర్చను మరింత వేడెక్కించింది. ట్రంప్ వర్గం శాంతిభద్రతలు, దేశ భద్రత అంశాన్ని ప్రధానంగా వాడుకుంటుండగా ప్రత్యర్థి వర్గాలు ఇమ్మిగ్రేషన్ అధికారుల కర్కశత్వాన్ని ఎండగడుతున్నాయి.
మొత్తానికి రెనీ నికోల్ గుడ్ మృతి అమెరికాలో ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లోపాలను.. రాజకీయ వైరుధ్యాలను మరోసారి బహిర్గతం చేసింది.