అమెరికా వచ్చే పర్యాటకులకు షాక్ ఇచ్చిన ట్రంప్.. గట్టి దెబ్బ

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడో.. ఎందుకిలా బాదుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.;

Update: 2025-11-28 14:45 GMT

అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడో.. ఎందుకిలా బాదుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. విదేశీయులను అమెరికా నుంచి తరిమేస్తున్న ట్రంప్ ఆ క్రమంలోనే భారీ ఫీజులు, కఠిన నిబంధనలతో హడలెత్తిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా వివిధ దేశాల నుంచి అమెరికా వచ్చే పర్యాటకులకు షాక్ ఇచ్చాడు. అమెరికాకు విదేశీయులను రాకుండా చేసేస్తున్నాడు.

అమెరికా పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్న విదేశీ పర్యాటకులకు షాకింగ్ న్యూస్. 2026 జనవరి 1 నుండి యెల్లోస్టోన్, గ్రాండ్ కాన్యాన్, యోసెమిటీ వంటి 11 ప్రముఖ నేషనల్ పార్కులను సందర్శించాలంటే విదేశీయులు భారీగా అదనపు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

కీలక మార్పులు ఏమిటి?

విదేశీ పర్యాటకులు వ్యక్తిగతంగా $100 అదనపు ఎంట్రీ ఫీజు చెల్లించాలి. వార్షిక పాస్ ధర $250కి పెరిగింది. అమెరికా పౌరులకు యథావిధిగా $80 ఉంటుంది . ఈ కొత్త ఫీజు విధానాన్ని "అమెరికా ఫస్ట్ ప్రైసింగ్’ అనే పేరుతో అమలు చేయనున్నారు.

పర్యాటక రంగంలో ఆందోళన

ఈ 'అమెరికా మొదట' ధరల విధానం పర్యాటక రంగానికి, ముఖ్యంగా స్థానిక వ్యాపారాలకు పెద్ద దెబ్బగా మారే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కెనడా, చైనా, భారత్ వంటి దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఈ భారీ ఫీజుల కారణంగా అమెరికా పర్యటనను వాయిదా వేసుకునే లేదా రద్దు చేసుకునే అవకాశం ఉందని మోటెల్ యజమానులు, స్థానిక వ్యాపారులు భయపడుతున్నారు. అయితే ప్రభుత్వం కేవలం 1% మంది పర్యాటకులు మాత్రమే తగ్గుతారని అంచనా వేసింది. ఈ నిర్ణయం వల్ల పర్యాటక అనుభవం పట్ల దుష్ప్రభావం చూపుతుందని, ఇది సామాజిక విలువలను విస్మరించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

పార్కుల నిర్వహణకు నిధులు

ఈ ఫీజుల పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయం దాదాపు సంవత్సరానికి $1 బిలియన్ ఉంటుందని అంచనా. ఈ నిధులను పార్కుల నిర్వహణకు, పాడైపోతున్న మౌలిక వసతుల మరమ్మతులకు ఉపయోగించాలని ప్రభుత్వం పేర్కొంది.

వివిధ దేశాలు విదేశీయులపై అధిక పర్యాటక ఫీజులు విధిస్తున్న నేపథ్యంలోనే అమెరికా ఈ విధానాన్ని తీసుకుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధనలు అమెరికా నేషనల్ పార్కులను సందర్శించాలనుకునే అంతర్జాతీయ పర్యాటకులకు భారీ ఆర్థిక సవాలును విసిరే అవకాశం ఉంది.

2026 నుండి అమెరికా నేషనల్ పార్కులపై విదేశీయుల కోసం భారీ ఎంట్రీ ఫీజులు.. వార్షిక పాస్ ధరలు పెరిగిపోతుండడంతో ఇది పర్యాటక రంగానికి పెద్ద దెబ్బ కావచ్చు, స్థానిక వ్యాపారాలకు, అంతర్జాతీయ పర్యాటకులకు ఇది భారీ నష్టాన్ని కలిగిస్తుంది.

Tags:    

Similar News