వైరల్ : హూతీలను ఎలా చంపారో వీడియోను చూపించిన ట్రంప్!

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన వీడియోను తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.;

Update: 2025-04-05 07:37 GMT

యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులపై అమెరికా జరిపిన దాడులకు సంబంధించిన వీడియోను తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలను షేర్ చేస్తూ హూతీలు నౌకలపై దాడులు చేయడానికి సమావేశమయ్యారని ఆయన ఆరోపించారు. అయితే వారి ప్రయత్నాలను తాము అడ్డుకున్నామని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ షేర్ చేసిన వీడియోలో గుండ్రంగా నిలబడి ఉన్న ఒక గుంపుపై వైమానిక దాడి జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనే దానిపై ట్రంప్ స్పష్టత ఇవ్వనప్పటికీ, ఇటీవల అమెరికా దళాలు యెమెన్‌లో జరిపిన దాడులకు సంబంధించినదిగా భావిస్తున్నారు.

ఇటీవల హూతీలు ఇజ్రాయెల్‌కు చెందిన నౌకలపై దాడులు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో వారికి బలమైన సంకేతాలు పంపాలని మార్చి 15న ట్రంప్ ఆదేశించారు. ఈ క్రమంలోనే అమెరికా దళాలు యెమెన్‌లో పెద్ద ఎత్తున దాడులు చేశాయి. ఈ దాడుల్లో 50 మందికి పైగా హూతీలు మరణించగా అనేక మంది గాయపడ్డారని వార్తలు వచ్చాయి.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికా యొక్క వాణిజ్య , నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించకుండా ఏ ఉగ్రశక్తి కూడా అడ్డుకోలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా హూతీలకు మద్దతు ఇవ్వడం మానుకోవాలని ఆయన ఇరాన్‌ను హెచ్చరించారు.

అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. టెహ్రాన్ సుప్రీంలీడర్ ఖమేనీ స్పందిస్తూ హూతీల దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. వారు సొంత కారణాల వల్ల దాడులు చేస్తున్నారని, ఈ విషయంలో అమెరికా తమపై నిందలు వేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరోవైపు హూతీ పొలిటికల్ బ్యూరో అమెరికా దాడులను యుద్ధ నేరంగా అభివర్ణించింది. ఈ చర్యలకు ప్రతిస్పందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేసింది.

మొత్తానికి ట్రంప్ షేర్ చేసిన ఈ వీడియో, ఆయన వ్యాఖ్యలు ప్రాంతీయంగా మరింత ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. అమెరికా - హూతీల మధ్య కొనసాగుతున్న ఈ ఘర్షణలు ఎటువైపు మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.

Tags:    

Similar News