హెచ్1బీకి ఇన్ని కష్టాలా...ట్రంపూ నీకో దండం సామీ....

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2.0 వెర్షన్ అతి భయంకరంగా ఉంటోంది. అమెరికా మరింత మెరుగదల కోసం అన్న ట్రంప్ నినాదాన్ని నమ్మి అమెరికన్లు ట్రంప్ కు రెండోసారి పట్టం కట్టారు.;

Update: 2025-12-04 12:36 GMT

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2.0 వెర్షన్ అతి భయంకరంగా ఉంటోంది. అమెరికా మరింత మెరుగదల కోసం అన్న ట్రంప్ నినాదాన్ని నమ్మి అమెరికన్లు ట్రంప్ కు రెండోసారి పట్టం కట్టారు. కానీ వారే ఇపుడు తలలు పట్టుక్కూర్చొంటున్నారు. ఏ క్షణంలో ఏం రూల్ తెస్తాడో...ఎవరిపై బాంబు పేలుస్తాడో తెలీదు. అంతా మిస్టర్ అయోమయంలా తయారయ్యాడు.

అమెరికాలో విదేశీయులు పనిచేసుకునేందుకు నిర్దేశించిన హెచ్1బీ వీసాల చుట్టూ రోజుకో నట్టు బిగిస్తున్నాడు. వీసా రావాలంటే లక్ష డాలర్లు కట్టాల్సిందే...రెనీవల్ కు కూడా అనగానే 24 గంటల్లోగా విదేశాల్లో ఉన్న పలువురు ఉరుకులు పరుగులతో అమెరికా చేరుకున్నారు. ఆ తర్వాత కూల్ గా అబ్బే అదే లేదు అని తేల్చేశాడు. ఆ తర్వాత అమెరికాలో పుట్టినా విదేశీయులకు సిటిజెన్ షిప్ రాదని ఇంకో బాంబు పేల్చాడు. పాకిస్తాన్ ఇండియా మధ్య తనే శాంతి కుదిర్చానని డాంబికాలు పలికాడు. నోబెల్ పురస్కారం ఇవ్వకపోతే అంతుచూస్తా అని రంకెలు వేశాడు. ఇపుడు తాజాగా హెచ్1బీ వీసా పై మరో రూల్ తెచ్చాడు. అదే వెట్టింగ్...

హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకునే వారి లింక్ డిన్ పేజీలు, రెజ్యూమేలు విధిగా చెక్ చేయాలని రివ్యూ చేయాలని దౌత్యవేత్తలకు అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ హుకుం జారీ చేసింది. ఈ మేరకు డిసెంబర్ 2న అన్ని అమెరికా ఎంబసీ కార్యాలయాలకు వెట్టింగ్ ఆదేశాలు జారీ అయ్యాయి. హెచ్1బీతో పాటు హెచ్ 4 వీసాదారుల లింక్ డిన్ ప్రొఫైల్, రెజ్యూమేలు చెక్ చేయాలి. అసత్య ప్రచారం, కంటెంట్ కంట్రోల్, ఫ్యాక్ట్ చెక్, ఆన్ లైన్ సేఫ్టీ విభాగాల్లో పనిచేశారో లేదో తెలుసుకోవాలి. వీసాలకు దరఖాస్తు చేసుకున్నవారు విధిగా తమ సోషల మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్ లను పబ్లిక్ చేయాలి. దీన్నే సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు.

యూఎస్ వీసా పొందడం ఎట్టిపరిస్థితుల్లోనూ హక్కు కాదని అమెరికా అంటోంది. దేశభద్రతకన్నా తమకు ఏదీ ఎక్కువ కాదని, అందుకే హెచ్1 బీ వీసాకు అప్లై చేసుకునేవారి దరఖాస్తులతోపాటు వారి సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్నంగా పరిశీలించి సంతృప్తి చెందితేనే వీసా మంజూరు చేస్తామని వెల్లడించారు. హెచ్1బీ వీసా దరఖాస్తుదారుల్లో చైనా, ఇండియన్లే అధికసంఖ్యలో ఉంటారు.

కాగా అమెరికా,యూరప్ దేశాలు ఇలా వలస నిబంధనలను కఠినతరం చేస్తే అది వారి దేశానికే నష్టమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. టాలెంట్ ఉన్నవారిని అడ్డుకుంటే అది వారి దేశ ప్రయోజనాలకే గొడ్డలిపెట్టని వ్యాఖ్యానించారు. తెలివితేటల్ని వాడుకోవడం ద్వరా పరస్పరం ప్రయోజనాలకు దోహదపడుతుందని, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎవరు ఎక్కడైనా పనిచేసుకునే అవకాశాలు పొందాలని వారు తెలిపారు. మొత్తానికి అమెరికా వీసా దొరకడం ఇలా కష్టమవుతుంటే...క్రమంగా విదేశీయులకు యూఎస్ పై మోజు తగ్గిపోతుంది.

Tags:    

Similar News