ప్రపంచంలోనే తొలిసారి మనిషికి పంది కిడ్నీ.. 2 నెలలకు ఏం జరిగిందంటే?

సరిగ్గా రెండు నెలల కిందట అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Update: 2024-05-12 11:35 GMT

సరిగ్గా రెండు నెలల కిందట అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇప్పటివరకు మనిషికి చికిత్సలో వివిధ రకాల జంతువుల అవయవాలను అమర్చారని విన్నాం.. కానీ, మనిషి ఎక్కువగా ఇష్టపడని ఓ జంతువు అవయవాన్ని తొలిసారి అమర్చడంతో చాలా సంచలనమైంది. అంతా బాగుంది అనుకుంటుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

62 ఏళ్ల ఆ వ్యక్తి..

అమెరికాకు చెందిన 62 ఏళ్ల రిచర్డ్ స్లే మ్యాన్ కు కొన్నాళ్లుగా మూత్ర పిండాల వ్యాధి ఉంది. దీంతో అతడు చాలా బాధపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆరేళ్ల కిందట అతడికి చనిపోయిన వ్యక్తి కిడ్నీని అమర్చారు. అయితే, అది విఫలం అయింది. దీంతో జన్యుపరంగా మార్పిడి చేసిన పంది కిడ్నీని అమర్చాలనే ఆలోచన చేశారు వైద్యులు. సహజంగా ఇది చాలా శ్రమతో కూడుకున్నది. అంతేగాక ప్రపంచంలో తొలిసారి. అయినప్పటికీ రిచర్డ్‌, అతడి కుటుంబం అంగీకరించారు. మసాచుసెట్స్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు

మార్చి నెలలో నాలుగు గంటల పాటు సర్జరీ చేసి పంది కిడ్నీని స్లే మ్యాన్ కు అమర్చారు. అది చక్కగా పని చేస్తోందని, డయాలసిస్ అవసరం లేదని ప్రకటించారు. ప్రాణాలు తోడేసేంతటి డయాలసిస్ నుంచి బయటపడడంతో స్లేమ్యాన్ అప్పట్లో ఆనందం వ్యక్తం చేశాడు. ఇది జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పాడు. రెండు వారాల అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

మరణానికి తెలియరాని కారణాలు..

అప్పటినుంచి బాగానే ఉన్న స్లేమ్యాన్ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. చికిత్స పూర్తయిన గత రెండు నెలలుగా అతడికి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తలేదు. దీంతో స్లే మ్యాన్ ఆకస్మిక మరణానికి శస్త్ర చికిత్సకు సంబంధం లేదని

ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అతడి మరణం పట్ల మసాచుసెట్స్ జనరల్ ట్రాన్స్‌ప్లాంట్ బృందం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. స్లేమ్యాన్ మృతికి కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంది. స్లేమ్యాన్ స్వస్థలం కూడా మసాచుసెట్స్‌ లోనే ఉంది.

Tags:    

Similar News