గరిష్టం 24 ఏళ్లు... దేశంలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంలు వీరే!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.;
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో జేడీ (యూ) నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి ఆ పదవిని అలకరించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ఇది సరికొత్త రికార్డ్. ఈ నేపథ్యంలో దేశంలో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన టాప్ 10 నేతలు ఎవరనేది ఇప్పుడూ చూద్దామ్...!
అవును... ముఖ్యమంత్రి అనే సవాలుతో కూడుకున్న బాధ్యతలను ఎంపిక చేసిన కొద్దిమంది మాత్రమే ఎక్కువకలం ఆ పదవిని నిర్వహించే సామర్ధ్యాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో... సిక్కింకు పవన్ కుమార్ చామ్లింగ్ నుంచి, ఒడిశాకు నవీన్ పట్నాయక్ వరకూ ఈ నాయకులు తమ తమ రాష్ట్రాల్లో రాజకీయంగా, సామాజికంగా శాశ్వత ప్రభావాన్ని చూపించారు.
పవన్ కుమార్ చామ్లింగ్ (24.165):
స్వతంత్ర్య భారతదేశంలో ఇప్పటివరకూ అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన జాబితాలో టాప్ ప్లేస్ లో ఉన్నారు పవన్ కుమార్ చామ్లింగ్. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి చెందిన ఈయన.. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా 24 సంవత్సరాల 165 రోజులు పని చేశారు. 1994 డిసెంబరు 12 నుంచి 2019 మే 26 వరకు ఆయన ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఫలితంగా... ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నేతల జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.
నవీన్ పట్నాయక్ (24.99):
పవన్ కుమార్ తర్వాత స్థానంలో నవీన్ పట్నాయక్ నిలిచారు. బిజూ జనతాదళ్ పార్టీకి చెందిన ఈయన 5 మార్చి 2000 నుంచి 12 జూన్ 2024 వరకూ ఒడిశా ముఖ్యమంత్రిగా అవిరామంగా పనిచేశారు. దీంతో... దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నేతల జాబితాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు.
జ్యోతి బసు (23.137):
పశ్చిమ బెంగాల్ లోనే కాదు భారతదేశంలోనే అత్యంత రాజకీయ చతురత కలిగిన నాయకుల్లో ఒకరిగా మంచి పేరు సంపాదించుకున్న జ్యోతి బసు.. పశ్చిమ బెంగాల్ కు ముఖ్యమంత్రిగా 23 సంవత్సరాల 137 రోజులు పని చేశారు. ఇందులో భాగంగా... జూన్ 21 1977 నుంచి నవంబర్ 5 - 2000 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
గెగాంగ్ అపాంగ్ (22.250):
అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న గెగాంగ్ అపాంగ్... తన పొలిటికల్ కెరీర్ లో నాలుగు పార్టీల నుంచి రెండు వేర్వేరు సార్లు కలిపి 22 సంవత్సరాల 250 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో భాగంగా... 1980 జనవరి 18 నుంచి 1999 జనవరి 19 వరకూ మొదటి దఫా... భారత జాతీయ కాంగ్రెస్, అరుణాచల్ కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్యమంత్రిగా పని చేశారు.
అనంతరం... 2003 ఆగస్టు 3 నుంచి 2007 ఏప్రిల్ 9 వరకూ రెండోసారి యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, భారతీయ జనతాపార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ ల నుంచి సీఎం పదవిలో కొనసాగారు. ఈ జాబితాలో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు.
లాల్ థన్హావ్లా (22.60):
మిజోరాం రాష్ట్రానికి భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు వేర్వేరు పర్యాయాల్లో 22 సంవత్సరాల 60 రోజులు ముఖ్యమంత్రిగా పని చేశారు లాల్ థన్హావ్లా. ఇందులో భాగంగా... 1984 మే 5 నుంచి 1986 ఆగస్టు 21 వరకూ మొదటి దఫాలో.. 1989 జనవరి 24 నుంచి 1998 డిసెంబర్ 3 వరకూ రెండో దఫాలో.. 2008 డిసెంబర్ 11 నుంచి 2018 డిసెంబర్ 15 వరకూ మూడో దఫాలో ఆ పదవిలో కొనసాగారు.
వీరభద్ర సింగ్ (21.13):
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు వీరభద్ర సింగ్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన ఆయన... నాలుగు వేర్వేరు పర్యాయాల్లో మొత్తంగా 21 సంవత్సరాల 13 రోజులు ఆ పదవిలో కొనసాగారు. సీఎంగా ఆయన పదవీకాలం 8 ఏప్రిల్ 1983 నుంచి 2017 డిసెంబర్ 27 వరకూ నాలుగు దఫాలుగా సాగింది.
మాణిక్ సర్కార్ (19.363):
త్రిపురకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు మాణిక్ సర్కార్. ఈయన హయాంలో త్రిపుర రూపురేఖలు మారినట్లు చెబుతారు. భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు) పార్టీకి చెందిన ఈ సీనియర్ నాయకుడు త్రిపురను అవిరామంగా 19 సంవత్సరాల 363 రోజులు పాలించారు. ఇందులో భాగంగా... 1998 మారి 11 నుంచి 2018 మార్చి 9 వరకూ ఆ పదవిలో కొనసాగారు.
నితీశ్ కుమార్ (19.89):
తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి ఉత్సాహంగా ఉన్న నితీశ్ కుమార్... ఆ రాష్ట్రానికి ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇందులో భాగంగా... 3 మార్చి 2000 నుంచి 11 మార్చి 2000 వరకూ సమతా పార్టీ నుంచి సీఎంగా ఏడు రోజులు మాత్రమే పనిచేసిన ఆయన.. ఆ తర్వాత 24 నవంబర్ 2005 నుంచి ఇప్పటివరకూ (19 సంవత్సరాల 89 రోజులు!) ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. ఎన్డీయే కూటమి నుంచి మళ్లీ సీఎం పగ్గాలు అందితే.. మరోసారి సీఎం అవుతారు!
కరుణానిధి (18.362):
ద్రవిడ ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. తమిళ రాజకీయాలతోపాటు దక్షిణాది రాజకీయాలపైనా చెరగని ముద్రవేసిన కరుణానిధి.. నాలుగు దఫాల్లో 18 సంవత్సరాల 362 రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో భాగంగా... 10 ఫిబ్రవరి 1969న ద్రవిడ మున్నెట్ర కజగం పార్టీ నుంచి తొలిసారి సీఎం అయిన ఆయన... నాలుగు దఫాలుగా 2011 మే 16వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగారు!
ప్రకాశ్ సింగ్ బాదల్ (18.350):
పంజాబ్ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రకాశ్ సింగ్ బాదల్. ఇందులో భాగంగా... 27 మార్చి 1970 నుంచి 16 మార్చి 2017 వరకూ నాలుగు వేర్వేరు పర్యాయాల్లో మొత్తం 18 సంవత్సరాల 350 రోజులు.. శిరోమణి అకాలీ దళ్ పార్టీ నుంచి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు.