స్టాలిన్ కే జై కొడుతున్న సినీ నటుల పార్టీలు
తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గానూ జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పనిసరిగా ఉంది.;
తమిళనాడులో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు గానూ జరిగే ఈ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోరు తప్పనిసరిగా ఉంది. ఒక వైపు అధికారంలో ఉన్న డీఎంకే కూటమి ఉంది మరో వైపు అన్నా డీఎంకే నాయకత్వంలో మరో కూటమి ఉంది. ఇక కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న తమిళ దళపతి విజయ్ కి చెందిన టీవీకే పార్టీ ఉంది. వీటితో పాటుగా మరి కొన్ని పార్టీలు సైతం రంగంలో ఉన్నాయి. అయితే పోరు ప్రధానంగా ఈ మూడింటి మధ్యనే ఉంది అని అంటున్నారు.
విజయకాంత్ పార్టీతో :
ఇదిలా ఉంటే తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేస్తుకుంది. దశాబ్దాల పాటు సినీ రంగంలో తిరుగులేని హీరోగా తన హవా చాటుకుని రజనీకాంత్ తరువాత అంతటి సూపర్ స్టార్ డం సంపాదించిన విజయ్ కాంత్ డీఎండీకే పేరుతో కొత్త పార్టీని రెండు దశాబ్దాల క్రితం స్థాపించారు. అయితే ఆయన సీఎం కావాలని ప్రారంభించిన పార్టీ చివరికి ఆ కోరిక నెరవేర్చలేదు. ఈలోగానే ఆయన కొన్నేళ్ళ క్రితం మృతి చెందారు. ఇపుడు ఆయన సతీమణి ఆ పార్టీని నడిపిస్తున్నారు. తాజాగా చూస్తే ఆ పార్టీ అధికార డీఎంకేతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం విశేషం.
ఇదే మొదటిసారి :
అలా తమిళనాడులో దివంగత నటుడు రాజకీయ నాయకుడు అయిన విజయ్ కాంత్ స్థాపించిన డీఎండీకే పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు వ్యూహాత్మకమైన అడుగు వేసింది. డీఎంకే నేతృత్వంలోని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌తో పొత్తు పెట్టుకుంది దీని మీద డీఎండీకే కే ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ డీఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. కలసి ఎన్నికలను ఎదుర్కొంటామని ఆమె చెప్పారు.
అన్నా డీఎంకేతోనే పొత్తు :
ఇప్పటిదాకా చూస్తే అనేక అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ అన్నా డీఎంకేతో డీఎండీకే పొత్తు పెట్టుకుంది. గతంలో అయితే ఏకంగా రెండంకెల సీట్లను కూడా సాధించింది. కానీ అక్కడ నుంచి ఎదగలేక పోయింది. ఇపుడు స్టాలిన్ చెంతకు ఈ పార్టీ కూడా చేరింది. దాంతో మరో సినీ నటుడి పార్టీని డీఎంకే ఆకర్షించింది అని అంటున్నారు.
కమల్ హాసన్ సైతం :
ఇక ఇప్పటికే కమల్ హాసన్ నాయకత్వంలోని పార్టీ డీఎంకేతో పొత్తులో ఉంది. దానికి ఫలితంగా కమల్ ని రాజ్యసభకు పంపించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సీట్లు కూడా ఆ పార్టీకి దక్కుతాయి అని అంటున్నారు. రజనీకాంత్ 2021లో రాజకీయ పార్టీ పెడతారు అని అంతా భావించినా ఆయన పార్టీ పెట్టలేదు. ఆయనకు డీఎంకే నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో సినీ హీరోల పార్టీలను వారి అభిమానులను ఆకట్టుకోవడంలో స్టాలిన్ ముందు భాగాన ఉన్నారు అని అంటున్నారు. తమిళనాడు రాజకీయాలకు సినీ హీరోలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. దాంతో వారు ముఖ్యమంత్రులుగా కూడా అయ్యారు. కానీ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పొత్తు పార్టీలుగా మిగులుతున్నారు.