తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్.. వివాహాలకు ప్రత్యేక ఆఫర్స్

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో వివాహం చేసుకోవడాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.;

Update: 2026-01-20 07:17 GMT

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో వివాహం చేసుకోవడాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ పవిత్ర క్షేత్రంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సాగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం కావడం వల్ల, ఆ వైబ్రేషన్స్ మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించడం శుభప్రదమని భావిస్తారు. ఏడుకొండల వాడి చెంత జరిగే వివాహం ఒక పవిత్ర సంస్కారంగా ఇటు కుటుంబ సభ్యులు, అటు బంధుమిత్రులు భావిస్తారు. దీంతో తిరుమల-తిరుపతి దేవస్థానాన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ గా మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సంక్రాంతి పండుగ కోసం సొంతూరు నారావారిపల్లె వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ కోసం ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలతో టీటీడీ అధికారులు, పర్యాటక శాఖ సంయుక్తంగా తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ కోసం ప్రత్యేక ప్యాకేజి రూపొందించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఏటా సుమారు 15,000 నుండి 20,000 వరకు వివాహాలు జరుగుతుంటాయి. అయితే, శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ఈ సంఖ్య రోజుకు వందల్లో ఉంటుంది. తిరుపతి, తిరుచానూరుల్లో జరిగే వివాహాలు వీటికి అదనం. తిరుమలలో వివాహాలు చేసుకునే వారికి టీటీడీ కొన్ని ప్రత్యేక దర్శన సౌకర్యాలు కల్పిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ప్రత్యేకంగా నిర్మించిన 'కళ్యాణ వేదిక' వద్ద వివాహాలు చేసుకున్న వారికి రూ.300 ప్రత్యేక దర్శన ప్యాకేజి అందుబాటులో ఉంది. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ద్వారా కొత్త జంటకు ఆశీర్వచనం ఇప్పిస్తారు. స్వామి వారి శేష వస్త్రంతో పాటు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు.

అయితే ఇప్పటివరకు టీటీడీ కల్పిస్తున్న ఈ సౌకర్యాలకు అదనంగా మరికొన్ని సదుపాయాలు కల్పించడంతోపాటు తిరుమలలో వివాహాలు చేసుకునే జంటలకు ప్రోత్సాహం అందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. దీనివల్ల పర్యాటకాభివృద్ధి జరుగుతోందని అంచనా వేస్తున్నారు. తిరుమలలో టీటీడీ నిర్వహించే కల్యాణ వేదిక వద్ద ఎలాంటి ఖర్చు లేకుండానే వివాహాలు చేస్తారు. ఇక్కడ ఆర్భాటాలకు అవకాశం ఉండటం లేదు. కానీ, ప్రస్తుతం ప్రతి ఒక్కరు పెళ్లిని అత్యంత అర్భాటంగా నిర్వహించుకోవాలని మొగ్గు చూపుతున్నారు. దీంతో తిరుపతిలో వివాహాలు చేసుకోవాలని భావిస్తున్న జంటలకు కొండపై ఉన్న ప్రైవేటు మఠాలు, సత్రాలతోపాటు దిగువ తిరుపతి, తిరుచానూరు, తొండవాడ, శ్రీనివాసమంగాపురం వంటి ప్రాంతాల్లో ఉన్న కల్యాణ మండపాల్లో వివాహాలు చేసుకుంటున్నారు.

ఇలా టీటీడీ కల్యాణ వేదిక వద్ద కాకుండా ఇతర ప్రాంతాల్లో పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇప్పటివరకు ప్రత్యేక దర్శన సౌకర్యం లేకుండాపోయింది. దీనివల్ల భక్తులు నిరాశ చెందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గతవారం సంక్రాంతికి వచ్చిన సమయంలో తిరుపతి వెడ్డింగ్ డెస్టినేషన్ కోసం అధికారులకు కొన్ని నిర్దిష్ట సూచనలు చేశారని చెబుతున్నారు. కల్యాణ వేదిక వద్దే కాకుండా ఇతర చోట్ల వివాహాలు చేసుకునేవారికి శ్రీవారి దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదాలు ఇవ్వడంతోపాటు పూర్తిగా వివాహాలు చేసే బాధ్యతను సర్వీసు ప్రొవైడర్లకు అప్పగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది.

వివాహ వేదిక డెకరేషన్, క్యాటరింగ్, రవాణా, వసతి వంటి వాటిని సర్వీసు ప్రొవైడర్ల ద్వారా అందజేసి తిరుపతిలో వివాహాలను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటే పెళ్లిళ్లు చేసుకోవాలనుకునే వారు హాయిగా వచ్చి తమ పని ముగించుకుని వెళతారని, దీనివల్ల ఆదాయం పెరగడంతోపాటు స్థానికులకు ఉపాధి లభిస్తోందని పర్యాటక శాఖ అంచనా వేస్తోంది. దీనిపై ప్రాథమిక ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తే, ఇకపై తిరుమలలో పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరగడంతోపాటు వ్యయ, ప్రయాసలు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News