తిరుమలలో డిజిటల్ దొంగలు.. సర్కారుకు బ్యాడ్ నేమ్!
తిరుమల పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుని.. ఏడుకొండలవాడి దర్శనం కోసం తపించి పోయే.. భక్తుల వీక్ నెస్‌ను కొందరు దొంగలు.. తమకు లాభార్జనగా మార్చుకుంటున్నారు.
తిరుమల పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుని.. ఏడుకొండలవాడి దర్శనం కోసం తపించి పోయే.. భక్తుల వీక్ నెస్‌ను కొందరు దొంగలు.. తమకు లాభార్జనగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లను ముందుగానే బుక్ చేసుకుని.. వాటిని దొడ్డిదారిలో విక్రయిస్తున్నారు. ఒకరకంగా.. ఇది తిరుమల డిజిటల్ దొంగలకు ఆవాసంగా మారిందన్న సంకేతాలను ఇస్తోంది.
ఏం చేస్తారు?
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ రకాల టికెట్లు అందుబాటులో ఉంటున్నాయి. నెలకు ఒకసారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వీటితో పాటు.. ప్రతి రోజూ ప్రస్తుతం అత్యంత ఖరీదైన రూ.10 వేల టికెట్లను `శ్రీవాణి` రూపంలో తిరుమల అధికారులు.. ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. రోజుకు ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకుని.. ఈ టికెట్లను 800 వరకు విడుదల చేస్తారు. ఈ టికెట్ తీసుకున్న వారి కుటుంబంలోని ఐదుగురు వరకు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది.
దీంతో ఈ టికెట్ల కోసం భక్తుల్లోనూ డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిని ఆసరా చేసుకున్న డిజిటల్ దొంగలు.. టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయడానికి ముందుగానే.. తాము ముందుగానే కుదుర్చుకున్న బేరం ప్రకారం.. భక్తుల నుంచి వివరాలు సేకరించి.. 'ఆటోఫిల్లింగ్' యాప్ ద్వారా ఆయా వివరాలను సిద్ధం చేసుకుంటారు. అంతేకాదు.. వాస్తవానికి ఆన్‌లైన్ ఈ టికెట్లను విడుదల చేయడానికి 10 నిమిషాల ముందుగానే వీరు టికెట్లను బుక్ చేసుకుని ఒక్కొక్క టికెట్‌పై 3 నుంచి 5 వేల రూపాయలను గడిస్తున్నారు. దీంతో సాధారణ భక్తులకు ఈ టికెట్లు లభించడం లేదు.
ఎవరి సహకారం?
తిరుమలలో గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతోంది. దీని వెనుక పెద్ద తలకాయలనే ఉన్నాయని.. రోజుకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు దొడ్డిదారిలో సంపాయించుకుంటున్నారని.. విజిలెన్స్ అధికారులు లెక్కలు తీశారు. దీనిని అరికట్టేందుకు పెద్ద ఎత్తున విచారణ జరగాల్సి ఉందని చెబుతున్నారు. ఆలయంలో రెండో, మూడో గ్రేడ్ అధికారుల ప్రమేయంతోనే ఇదంతా జరుగుతున్నట్టు చెబుతున్నారు. మొత్తంగా ఆలయ అధికారులు, సిబ్బంది కుమ్మక్కయి.. ఈ దొడ్డిదారి వ్యాపారం చేస్తూ.. ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు.