కాలమే హీరో.. మరోసారి తేలిపోయింది సారూ!
అందుకు భిన్నంగా తనకు మించిన తోపు లేదని.. కాలాన్ని సైతం తాను శాసిస్తాన్న నమ్మకం వచ్చేస్తే మాత్రం.. అది అపాయకరమైన సంకేతంగా చెప్పాలి.;
ఎవరెన్ని అనుకున్నా.. కాలం మాత్రమే స్థిరమైనది. దాని ముందు మిగిలిన వారంతా వచ్చి పోవటమే తప్పించి.. శాశ్వితంగా ఉండటం అసాధ్యం. కదిలే కాలానికి తగ్గట్లు పరిస్థితుల్లో మార్పులు వచ్చేస్తుంటాయి. అయితే.. చేతికి వచ్చిన అధికారాన్ని అహంభావానికి పోకుండా.. అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ఆచితూచి అడుగులు వేస్తే.. పవర్ చేతిలో ఎక్కువ కాలం ఉంటుంది. అందుకు భిన్నంగా తనకు మించిన తోపు లేదని.. కాలాన్ని సైతం తాను శాసిస్తాన్న నమ్మకం వచ్చేస్తే మాత్రం.. అది అపాయకరమైన సంకేతంగా చెప్పాలి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి రావటం.. నాన్ స్టాప్ గా తొమ్మిదిన్నరేళ్లు కొనసాగటం తెలిసిందే. మరోసారి అధికారంలోకి రావటం ఖాయమన్న ధీమా కేసీఆర్ తో పాటు ఆయన పరివారం మొత్తం అదే నిజమని నమ్మేది. ప్రజల్లో వచ్చిన మార్పు.. ప్రభుత్వంపై పెల్లుబికిన వ్యతిరేకత కనిపించలేదు. దీంతో.. వ్యూహచతురతకు.. పోల్ మేనేజ్ మెంట్ కు తిరుగులేని తోపుగా చెప్పుకునే కేసీఆర్ ఓటమిపాలయ్యారు. ఇదంతా ఒక ఎత్తు.. తన మాటతో.. ఆ మాటకు వస్తే తన కనుసైగతో శాసించిన కేసీఆర్.. కాలపరీక్ష ముందు నిలబడిపోయారు.
చేతిలో ఉన్న అధికారం చేజారిన తర్వాత.. ఫాంహౌస్ కు వెళ్లిపోయిన కేసీఆర్.. రేవంత్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేసినంతనే.. ఫాంహౌస్ బాత్రూంలో కాలు జారి పడటం.. తుంటి ఎముకకు తీవ్రగాయం కావటం తెలిసిందే. దీంతో ఆసుపత్రిపాలైన ఆయన.. మూడు నెలల వరకు మామూలు మనిషి కాలేని పరిస్థితి. ఆసుపత్రి బెడ్ మీద ఉన్న కేసీఆర్ ను చూసిన వారంతా కాలాన్ని గుర్తు తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎలాంటి మనిషి.. ఎలాంటి పరిస్థితి అనుకునే పరిస్థితి. ఎవరినైనా కంట్రోల్ చేసే శక్తి ఉందనుకునే కేసీఆర్ ను కాలం ఇంతలా కంట్రోల్ చేయటం గమనార్హం. ఇదంతా చూసినప్పుడు కాలం తిరుగులేని శక్తి అన్న విషయం మరోసారి స్పష్టమైందని చెప్పాలి.