ఐదు పులుల మృతి.. ముగ్గురు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..?

అయితే... గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపడం వల్లే అవి చనిపోయినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ సమయలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు.;

Update: 2025-06-28 17:48 GMT

అసలే దేశంలో పులులు, సింహాల సంఖ్య తగ్గిపోతుందనే ఆందోళనలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే! దీంతో... ఉన్నవాటిని రక్షించడానికి, వాటి సంఖ్య పెంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. ఐదు పులులు అనుమానాస్పద మృతికి కారణం తెలిసింది.

 

అవును... తమిళనాడు - కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర వన్యధామం పరిధిలో ఐదు పులులు మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది. మృతిచెందిన వాటిలో ఓ తల్లి పులి, నాలుగు కూనలు ఉన్నాయి. ఈ ఘటనపై 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని అటవీశాఖ మంత్రి ఆదేశించారు.

అయితే... గుర్తు తెలియని వ్యక్తులు విషం పెట్టి చంపడం వల్లే అవి చనిపోయినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ సమయలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా... పులులకు విషం పెట్టి చంపిన ఓ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ పని చేయడానికి గల కారణాన్ని వారు వెల్లడించారు.

ఇందులో భాగంగా... కర్ణాటకకు చెందిన మాదురాజు అనే వ్యక్తి తన ఆవును పులి చంపినందుకు ప్రతీకారంగా అక్కడ తిరిగే పులులకు విషం పెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. తాము ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న 'కెంచి' అనే ఆవును ఇటీవల ఓ పులి వేటాడి చంపడంతో.. మాదురాజు తీవ్ర ఆవేదనకు గురయ్యాడని తెలిపారు.

ఈ క్రమంలో... ఎలాగైనా అడవిలోని క్రూరమృగాలను చంపాలని పథకం వేశాడని అధికారులు తెలిపారు. ఈ సమయంలో... కోనప్ప, నాగరాజు అనే ఇద్దరు స్నేహితుల సహాయంతో చనిపోయిన తన ఆవు కళేబరంపై విషం చల్లి.. దానిని అడవికి సమీపంలో పడేసినట్లు తెలిపారు. ఆ విష కళేబరాన్ని తిన్న ఓ పులి, నాలుగు కూనలు ప్రాణాలు కోల్పోయాయని తెలిపారు.

Tags:    

Similar News