బీసీల జోలికొస్తే శిక్షలే...కూటమి కొత్త చట్టం
బీసీల జోలికి ఎవరైనా రావాలని అనుకున్నా వారిని దూషించాలని చూసినా ఇక మీదట ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారిని వేధింపులకు గురి చేయాలని చూస్తే కఠినమైన చట్టం అండగా ఉంటుంది.;
బీసీల జోలికి ఎవరైనా రావాలని అనుకున్నా వారిని దూషించాలని చూసినా ఇక మీదట ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారిని వేధింపులకు గురి చేయాలని చూస్తే కఠినమైన చట్టం అండగా ఉంటుంది. ఆ చట్టంలో పేర్కొన్న మేరకు కేసు తీవ్రతను బట్టి ఏకంగా 15 రకాలైనవేధింపుల కేసులలో ఏదో ఒకదానిని దూషించిన వారి మీద పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు.
త్వరలోనే బీసీ రక్షణ చట్టం :
ఏపీలో తొందరలోనే బీసీ రక్షణ చట్టం అమలులోకి తీసుకుని రావడానికి కూటమి ప్రభుత్వం పట్టుదలగా పరిశ్రమిస్తోంది. బీసీల గౌరవప్రద జీవనం కూటమి సంకల్పమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఈ కొత్త చట్టం ప్రకారం వెనుకబడిన వర్గాల ధన మాన ప్రాణ రక్షణకు ప్రాధాన్యం కల్పిస్తామని అన్నారు. అంతే కాదు బీసీలను కులం పేరుతో గానీ వృత్తి పేరుతో గానీ దూషించినా, సాంఘిక బహిష్కరణలకు పాల్పడినా గాని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
చట్టానికి తుది మెరుగులు :
ఇక బీసీ రక్షణ చట్టానికి తుది రూపు ఇవ్వడానికే బీసీ మంత్రులతో కీలక భేటీని బీసీ మంత్రులతో తాజాగా నిర్వహించారు. ఇక ఇప్పటికే బీసీ చట్టం ముసాయిదా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏపీలో ఉన్న 138 కులాలకు చెందిన బీసీల ధన, మాన, ప్రాణాలకు భరోసా కల్పించేలా బీసీ రక్షణ చట్టాన్ని పటిష్టంగా రూపొందించాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ చట్టం ప్రకారం 15 రకాల వేధింపులకు శిక్షలు రూపొందిస్తున్నారు.
బీసీ ప్రతినిధులతో :
ఇక దేశంనే తొలిసారిగా ఏపీలో బీసీ రక్షణ చట్టం అమలు చేయబోతున్నారు. బీసీ రక్షణ చట్టం డ్రాఫ్ట్ పై బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అయిదు జోన్లలోని బీసీ సంఘాలు, ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బీసీలను అన్ని రంగాల్లో ముందు నిలపాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అంటున్నారు. కేంద్ర అడ్వకేట్ జనరల్, జాతీయ బీసీ కమిషన్ సలహాలు సూచనలను కూడా ఏపీ బీసీ రక్షణ చట్టం రూపకల్పనలో పరిగణలోకి తీసుకున్నట్లుగా ఆమె వివరించారు.