గడప దాటని.. `తోట` రాజకీయం.. !
సీనియర్ నాయకుడు తోట నరసింహం ఆయన భార్య తోట వాణి రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఎటువైపు సాగుతున్నాయి.. అనేది చర్చనీయాంశంగా మారింది.;
సీనియర్ నాయకుడు తోట నరసింహం ఆయన భార్య తోట వాణి రాజకీయాలు ఎలా ఉన్నాయి.. ఎటువైపు సాగుతున్నాయి.. అనేది చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో వైసిపి తరఫున పోటీ చేసిన తోటవాణి పరాజయం పాలయ్యారు. దీనికి ముందు టిడిపిలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తోట కుటుంబం కాకినాడ నుంచి ఎంపీగా నరసింహం గెలుపొందిన విషయం తెలిసిందే. అనంతరం పార్టీ టికెట్ ఇవ్వలేదన్న కారణంగా 2019 ఎన్నికలకు ముందు వైసీపీ లోకి వచ్చారు.
ఆ ఎన్నికల్లో పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి తోట వాణి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ప్రభావం ఉన్నప్పటికీ ఆమె పరాజయం పాలయ్యారు. ఇప్పుడు అసలు రాజకీయాలకు ఈ కుటుంబం చాలా దూరంగా ఉంటోంది. ఎక్కడా తోట నరసింహం పేరు గాని తోట వాణి పేరు గానీ వినిపించడం లేదు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా తోట నరసింహం దాదాపు ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారన్న వాదన ఒకవైపు వినిపిస్తుండగా..అదేం లేదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తాజాగా ఆయన ప్రకటించడం విశేషం.
నియోజకవర్గాల పెంపు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ కూడా కలిసి వస్తున్న నేపథ్యంలో తోట ఫ్యామిలీ మరోసారి యాక్టివ్ అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. అయితే ప్రస్తుతానికి ఈ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉండడం ఇటు వైసీపీలో అటు టిడిపికి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండడం విశేషం. వచ్చే ఎన్నికల నాటికి బలాబలాలను అంచనా వేసుకుని, ఈ కుటుంబం తిరిగి టిడిపి బాట పడుతుందన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే టిడిపిలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
గతంలో పార్టీ మారిన సమయంలో టిడిపి పై తీవ్ర విమర్శలు గుప్పించిన నరసింహం వైసీపీలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. కానీ రాజకీయాల్లో ఇవన్నీ అవసరం- అవకాశం అనే రెండు అంశాలపైనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఏదైనా జరగొచ్చు. వచ్చే ఎన్నికల నాటికి టిడిపిలోకి వచ్చినా ఆశ్చర్యం లేదన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన తోట నరసింహం కుటుంబానికి బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా కాకినాడచ పెద్దాపురం సహా పలు నియోజకవర్గాల్లో ఆయనకు అభిమానులు కూడా ఉన్నారు.
కానీ, ఎప్పటికప్పుడు పార్టీలు మారుతుండడం స్థిరమైన రాజకీయాల చేయకపోవడం వంటివి మాత్రం ఈ ఫ్యామిలీకి పెద్ద ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిణామాలే ఈ కుటుంబానికి శాపంగా కూడా పరిణమిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల తర్వాత రెండేళ్లుగా తోట నరసింహం పేరుగాని తోట వాణి పేరు గాని ఎక్కడ వినిపించలేదు. తాజాగా మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ పోటీ చేస్తామని నరసింహం స్థానిక మీడియాకు చెప్పుకొచ్చారు.
దీంతో ఆయన ఎంట్రీ దాదాపు ఖరారు అయినట్టు తెలుస్తోంది. అయితే ఆయన వైసీపీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే టిడిపి నుంచి చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం వైసీపీ కూడా తోట నరసింహాన్ని పక్కన పెట్టినట్టు సమాచారం.