ఉగ్రదాడి.. 'కలిమా' పారాయణం చేసి తప్పించుకున్న ప్రొఫెసర్!
అస్సాం యూనివర్శిటీలోని బెంగాలీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేబాషిష్ భట్టాచార్య తాజాగా పహల్గాంలో తనకు ఎదురైన మరణ భయాన్ని వెల్లడించారు.;
జమ్ముకశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొంతమంది పారిపోయి తప్పించుకున్నారు. ఈ సమయంలో ఉగ్రవాది మతోన్మాదాన్ని క్యాష్ చేసుకుని ఓ ప్రొఫెసర్ తప్పించుకున్నారు. ఇందులో భాగంగా.. దాడి సమయంలో ముష్కరుడి ముందు ఆయన 'కలిమా' పారాయణం చేశారు.
అవును... పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు అస్సాంకి చెందిన ప్రొఫెసర్. ఈ సమయంలో ఆయన తప్పించుకున్న విధానాన్ని, జరిగిన మొత్తం సంఘటనను వివరించారు. ఇందులో భాగంగా... కలిమా పారాయణం చేయడం తనకు తెలియడం కలిసివచ్చిందని.. అదే తన ప్రాణాలు కాపాడిందని ఆయన అన్నారు. మృత్యువు తనకు చాలా దగ్గరగా వెళ్లడం చూసినట్లు తెలిపారు.
అస్సాం యూనివర్శిటీలోని బెంగాలీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేబాషిష్ భట్టాచార్య తాజాగా పహల్గాంలో తనకు ఎదురైన మరణ భయాన్ని వెల్లడించారు. ఆయన తన ఫ్యామిలీతో కలిసి బెసరన్ లోయను సందర్శించడానికి వెళ్లినట్లు తెలిపారు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఉగ్రవాదులు అక్కడికి చేరుకున్నారని.. మతం ఏమిటని అడిగి కాల్చడం మొదలుపెట్టారని తెలిపారు.
ఆ సమయంలో తన భార్య, పిల్లలతో కలిసి ఓ చెట్టు కింద పడుకున్నట్లు చెప్పిన ఆయన.. ఆ సమయంలో ఓ ఉగ్రవాది తన వైపు వచ్చి.. ఏమి చేస్తున్నవని, ఏమతమని అడిగాడని.. అయితే విషయం గ్రహించి సమాధనం చెప్పే బదులు.. కలిమా బిగ్గరగా చెప్పడం ప్రారంభించానని.. ఇది చూసిన ఉగ్రవాది తన నుంచి అటువైపుగా వెళ్లిపోయారని ప్రొఫెసర్ తెలిపారు.
అదే సమయంలో తనకు సమీపంలో పడుకున్న వ్యక్తి తలపై కాల్చాడని తెలిపారు. అనంతరం ఉగ్రవాది అటు వైపుకు వెళ్లగా.. వెంటనే తన భార్య, కొడుకుతో రహస్యంగా పక్కకు కదిలి, సుమారు రెండు గంటలు నడిచి హోటల్ కు చేరుకున్నట్లు తెలిపారు. తాను ఇంకా బ్రతికి ఉన్నానంటే నమ్మలేకపోతున్నానని ఆయన అన్నారు.
కాగా... తాము, తన భర్త బితాన్ లాన్ పై కూర్చొని ఉండగా సైనిక దుస్తుల్లో కొంతమంది తమ వద్దకు వచ్చారని.. మీరు హిందువునా? ముస్లింనా? అని అడిగారని.. అనంతరం తన భర్తపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని.. తాను కళ్లు మూసి, కళ్లు తెరిచే లోపు తన భర్త కుప్పకూలిపోయి ఉన్నారని ఆమె కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన సంగతి తెలిసిందే.