టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ ఇంచార్జికి హెల్ప్ చేస్తున్నారా ?
సదరు వైసీపీ ఇంచార్జి అయితే అక్రమంగా లే అవుట్ వేశారని దానిని పీకించేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యే హెల్ప్ చేయడం ఏంటి అసలు ఏమి జరుగుతుంది అని క్యాడర్ అయితే ఫైరెక్కిపోతుంది అంటున్నారు.;
అదేమిటి అలా కూడా ఉంటుందా అని అనుకోవద్దు. దీనినే రాజకీయం అంటారు. ప్రత్యర్ధులు అన్నది తెర ముందు పదం కావచ్చు. తెర వెనక అంతా ఒక్కటిగా ఉంటారు అన్నది చాలా సార్లు ఎన్నో చోట్ల నిజమైన విషయం. ఇపుడూ అదే జరుగుతోంది అని అంటున్నారు. అధికారంలో ఉన్న వారి చుట్టూ చేరి పనులు చేయించుకోవడం రాజకీయ వ్యూహం. ఎన్నికల్లోనే ప్రత్యర్థులుగా ఉంటారు, అయిదేళ్ల పాటూ అలాగే ఉండాలంటే కుదరదు కదా అని చెప్పి సొంత పనుల కోసం వ్యాపారాలో కలిసే బాపతే ఇపుడు రాజకీయల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకే వింతా విడ్డూరం అయితే ఈ తరహా వార్తలలో లేదు కానీ మ్యాటర్ మాత్రం పొలిటికల్ మసాలాగా బాగా వైరల్ అవడమే విశేషం.
అక్కడ ఇద్దరూ ఒక్కటిగా :
వేరు పార్టీలు వేరే జెండాలు అజెండాలు కానీ కలిపింది ఏమిటి అంటే అధికారమే కావచ్చు అని అంటున్నారు. విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు ఆయన వైసీపీకి చెందిన ఒక నియోజకవర్గం ఇంచార్జికి బాగా అంటే చాలా బాగానే హెల్ప్ చేస్తున్నారుట. సరే ఇద్దరూ బాగానే సర్దుకుపోయారు అంటే అటు క్యాడర్ అసలు ఊరుకుంటుందా అందుకే ఆ ఎమ్మెల్యేను బాగా విమర్శిస్తోంది అని అంటున్నారు. మేము గెలిపించుకున్నాం, మా ఎమ్మెల్యే మాకు పనులు చేసి పెట్టాలి కానీ ప్రత్యర్థి అయిన వైసీపీ ఇంచార్జికి హెల్ప్ చేయడమేంటి అని టీడీపీ క్యాడర్ అయితే మండిపోతోంది అని అంటున్నారు.
అక్రమాలకు మద్దతుగానా :
ఇక మ్యాటర్ కూడా సీరియస్ గానే ఇక్కడ ఉందిట. సదరు వైసీపీ ఇంచార్జి అయితే అక్రమంగా లే అవుట్ వేశారని దానిని పీకించేయాల్సిన టీడీపీ ఎమ్మెల్యే హెల్ప్ చేయడం ఏంటి అసలు ఏమి జరుగుతుంది అని క్యాడర్ అయితే ఫైరెక్కిపోతుంది అంటున్నారు. ఇలా అయితే పార్టీలో ఎవరైనా ఉంటారా అని వారే నిలదీస్తున్నారుట. అదే వైసీపీ ప్రభుత్వం ఉన్నపుడు మా వెంచర్ల మీదకు వచ్చారు, అప్పటి ఎమ్మెల్యేతో కలసి మమ్మల్ని నాశనం చేశారు అని కూడా వారు ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు తెచ్చుకుని సదరు వైసీపీ ఇంచార్జి మీద గుస్సా అవుతున్నారుట.
ప్రభుత్వం వచ్చినా కూడా :
రాష్ట్రంలో అధికారం మారింది. సొంత పార్టీకి పవర్ వచ్చినా సదరు వైసీపీ ఇంచార్జి దే హవా అయితే ఎలా తట్టుకోగలమని కూడా క్యాడర్ అయితే ఆవేదన చెందుతోంది అని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేతో కలసి మళ్ళీ మమ్మల్నే ఇబ్బంది పెడుతున్నారు ఇదేమి ఖర్మా రా బాబూ అని వారు నెత్తీ నోరు కొట్టుకుంటున్నారుట. కేవలం ఈ జిల్లాలో ఇదొక్కటే నియోజకవర్గం కాదు చాలా చోట్ల ఇలాగే సీన్ ఉంది అని అంటున్నారు. వైసీపీ టీడీపీ చూస్తే రాష్ట్రంలో పై స్థాయిలో ఉప్పూ నిప్పుగా ఉంటున్నారు. కానీ చాలా నియోజకవర్గాల్లో మాత్రం వారూ వీరూ కలసి వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యవహారాలు నడుపుతున్నారు.
వైసీపీ టీడీపీ నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు అని అన్ని వైపుల నుంచి టీడీపీ క్యాడర్ లబోదిబోమని అంటోంది. ఈ విషయాన్ని కచ్చితంగా లోకేష్ దృష్టిలోకి తీసుకుని రావాలని అనుకుంటున్నారుట. ప్రకాశం జిల్లాలో ఆ నియోజకవర్గం క్యాడర్ అయితే పెద్దల వద్దకు ఈ పంచాయతీ పోవాల్సిందే అని పట్టుదలగా ఉన్నారుట. ఇదే తీరున వ్యవహారం సాగితే పార్టీ గెలిచి ప్రయోజనం ఏమిటి అని గుర్రు మీద ఉన్నారుట. మరి పై స్థాయిలో అయినా సెటిల్ చేయకపోతే ఏపీలో ఇలా చాలా చోట్ల జరుగుతూ పోతూంటాయి. చివరికి అది అంతిమంగా పార్టీకే చేటు తెస్తుంది అని అంటున్నారు.