మళ్లీ భావోద్వేగాల రాజకీయమేనా కేటీఆర్‌?

బీఆర్‌ఎస్‌ అసలు పోటీలోనే లేదని అంటున్నారు. 17 లోక్‌ సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉందని చెబుతున్నారు.

Update: 2024-04-29 07:18 GMT

చింతచచ్చినా పులుపు చావలేదని సామెత. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తో సహా ఆ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా ఆ పార్టీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదనే టాక్‌ నడుస్తోంది. ఇప్పుడు లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ అసలు పోటీలోనే లేదని అంటున్నారు. 17 లోక్‌ సభ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉందని చెబుతున్నారు.

ఈ క్రమంలో కాస్తో కూస్తో ఉనికి చాటుకోవడానికి బీఆర్‌ఎస్‌ నేతలు మళ్లీ భావోద్వేగ రాజకీయాలు మొదలుపెట్టారని టాక్‌ నడుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, కేసీఆర్‌ తనయుడు కేటీఆర్‌ కొత్త పల్లవి అందుకున్నారు.

భావోద్వేగ ప్రకటనలతో ప్రజలను రెచ్చగొట్టడం ద్వారానే బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో లబ్ధి పొందుతూ వచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అంటూ నినాదం మొదలుపెట్టి.. ఆంధ్రులు వీటన్నింటిని దోచుకుని తెలంగాణకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రజల్లో విషబీజాలు నాటారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇదే భావోద్వేగ రాజకీయాలు చేసి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

ఇక 2018లో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ కూటమి గెలిస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని.. తెలంగాణ ను ఆంధ్రాలో తిరిగి కలిపేస్తారంటూ విష ప్రచారం చేసి బీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

Read more!

ఇక 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కూడా బీఆర్‌ఎస్‌ ఇలాగే భావోద్వేగ రాజకీయ కుట్రకు తెరతీసిందనే ఆరోపణలున్నాయి. ఆంధ్రాలో కేసీఆర్‌ మిత్రుడైన వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉండటంతో ఆయన సహకారంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుపైకి ఏపీ పోలీసులను పంపి డ్యామ్‌ ను ఆక్రమించుకోవడానికి ఏపీ ప్రయత్నిస్తోందంటూ డ్రామా ప్లే చేయడానికి బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించారని అంటున్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే కేసీఆర్‌ అధికారంలో ఉంటేనే సాధ్యమవుతుందని ప్రజలు దీన్ని నమ్మాలన్నట్టు గేమ్‌ ఆడారని చెబుతున్నారు. అయితే కేసీఆర్‌ డ్రామాలను అర్థం చేసుకున్న ప్రజలు ఆయనకు కర్రుకాల్చి వాత పెట్టారని గుర్తు చేస్తున్నారు.

అయినా బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని టాక్‌ నడుస్తోంది. అందుకే ఇప్పుడు మళ్లీ ప్రశాంతంగా బతుకుతున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా కేటీఆర్‌ వ్యవహరిస్తున్నారని టాక్‌ నడుస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కేటీఆర్‌ ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.

అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర అవసరాలు తీరకముందే నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. వీటిని అడ్డుకునే శక్తి ఒక్క బీఆర్‌ఎస్‌ కే ఉందని గొప్పలు పోయారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలను బీఆర్‌ఎస్‌ కు గెలిపించాలని ప్రజలను కోరారు. అయితే కేటీఆర్‌ భావోద్వేగాల వలలో ప్రజలు చిక్కుకునే అవకాశమే లేదంటున్నారు. ఇందుకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటున్నారు.

Tags:    

Similar News