అమెరికాలో ఘోరం... తుపాకీ కాల్పులకు తెలుగు విద్యార్థి బలి!
ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.;
ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి.. అక్కడ జరిగే రోడ్డు ప్రమాదాలు, దాడులు, దుండగుల కాల్పుల్లో బలైపోతూ.. కన్నవారికి, కుటుంబ సభ్యులకు తీరని శోకం కలిగిస్తున్న ఘటనలు ఎన్నో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం జగిత్యాల జిల్లాకు చెందిన మహేందర్ రెడ్డి.. లండన్ లో గుండెపోటుతో మరణించగా.. తాజాగా అమెరికాలో మరో తెలుగు యువకుడు మృతి చెందాడు.
అవును... కన్నవారిని, ఉన్న ఊరిని వదిలి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి రకరకాల కారణాలతో మృత్యువాత పడుతున్న తెలుగువారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అమెరికాలో ఓ దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ కు చెందిన చంద్రశేఖర్ అనే యువకుడు స్వదేశంలో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్ (బీడీఎస్) విద్యను పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్లాడు. ఈ క్రమంలో డాలస్ నగరంలో నివాసం ఉంటూ చదువుకుంటున్నాడు. మరోవైపు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంకులో పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు.
ఈ క్రమంలో... శనివారం ఉదయం పెట్రోల్ పోసుకోవడానికి బంక్ కి వచ్చిన ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో బుల్లెట్ తగిలి చంద్రశేఖర్ మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు అమెరికా పోలీసులు తెలియజేశారు! దీంతో... చంద్రశేఖర్ కుటుంబం ఒక్కసారిగా తీరని శోకంలో మునిగిపోయింది.. కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది.
చంద్రశేఖర్ కుటుంబం హైదరాబాద్ ఎల్బీనగర్ లోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటుండగా.. అతడు మరణించిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రశేఖర్ పార్థీవ దేహాన్ని త్వరగా హైదరాబాద్ కు రప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.