ఇద్ద‌రు సీఎంలు-ఒక ప్రాజెక్టు-కూర్చుంటే పోలా!!

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల్లో కీల‌క‌మైన ఘ‌ట్టానికి కేంద్రం ఎలాంటి ముగింపు ఇస్తుంది? ఎలాంటి ద‌శ‌-దిశ చూపిస్తుంది? అనేది ఆస‌క్తిక‌రం.;

Update: 2025-06-20 15:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల వివాదాల్లో కీల‌క‌మైన ఘ‌ట్టానికి కేంద్రం ఎలాంటి ముగింపు ఇస్తుంది? ఎలాంటి ద‌శ‌-దిశ చూపిస్తుంది? అనేది ఆస‌క్తిక‌రం. తాజాగా తెర‌మీదికి వ‌చ్చిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు కావొచ్చు. గ‌తంలోనే ఉన్న సాగ‌ర్, శ్రీశైలం త‌గువులు కావొచ్చు.. వేటినైనా కేంద్రం ప‌రిష్క‌రించిం దా? అంటే.. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చోటు చేసుకున్న ఇలాంటి వివాదాల‌ను కేంద్రం ఎప్పుడూ రాజ‌కీయ కోణంలోనే చూసింద‌న్న‌ది వాస్త‌వం.

''తెలంగాణ‌లో అయినా.. ఏపీలో అయినా.. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు లేకుండా అడుగులు వేయ‌డం క‌ష్టం ''  అంటూ.. నిరుడు కేసీఆర్ హ‌యాంలోనే కేంద్రం స్ప‌ష్టం చేసింది. నాడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏపీలో త‌ల‌పెట్టిన రాయ‌ల‌సీమ ఎత్తిపోతల ప‌థ‌కం అయినా.. నేడు బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు అయినా.. స్వ‌రూపం.. సాధ్యాసాధ్యాలు కూడా ఒక్క‌టే. వృథాగా పోతున్న గోదావ‌రి జలాల‌ను.. ఒడిసి ప‌ట్టి.. క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లాల‌కు పారించ‌డ‌మే.

వృథాగా పోయే నీటి విష‌యం అయితే.. ఎందుకు ఇంత యాగీ ఉంటుంద‌న్న‌ది మ‌రోప్ర‌శ్న. వృథాగా పోయే నీటిని తీసుకుంటే.. ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండదు. కానీ.. ఏడాదిలో మూడు నుంచి 4 మాసాల వ‌ర‌కు మాత్ర‌మే నీటి వృథా మ‌న‌కు క‌నిపిస్తుంది. కానీ, ఇతర మాసాల్లోకి వ‌చ్చేస‌రికి.. గోదావ‌రి జలాలు ఆశించిన మేర‌కు కూడా ఉండ‌డం లేదు. ఇదే అస‌లు చిక్కు. ఈ విష‌య‌మే అస‌లు వివాదానికి కార‌ణం. ''నీరు ఉన్న‌ప్పుడు తీసుకుంటే త‌ప్పులేదు. కానీ, లేన‌ప్పుడు కూడా లాగేస్తారు'' అనేదే తెలంగాణ వాద‌న‌.

పైగా.. దిగువ రాష్ట్రంగా ఉన్న ఏపీ ప్రాజెక్టులు క‌ట్టుకుంటే.. ఇప్పుడు ఎలా ఉన్నా.. రేపు నీటి వాటాల విషయంలో ర‌గ‌డ‌లు, పంతాల‌కు పోయే అవ‌కాశం ఉంద‌ని తెలంగాణ భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే నాడు కేసీఆర్ కూడా రాయ‌ల‌సీమ ఎత్తిపోత‌ల ప్రాజెక్టుకు అడ్డుప‌డ్డారు. నేడు బ‌న‌క‌చ‌ర్ల వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.ఏపీకి గేమ్ ఛేంజ‌ర్ అంటూ.. చంద్ర‌బాబు ప్ర‌చారం చేసుకున్నా.. తెలంగాణ‌కు ఇది ఉరి తాడ‌వుతుంద‌న్న అక్క‌డి నేత‌ల ప్ర‌చారం కూడా చ‌ర్చ‌నీయాంశ‌మే.

దీంతో ఒక్క‌సారి ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్య‌మంత్రులు కూర్చుని మాట్లాడుకుంటే స‌మ‌స్య‌కు ఒక ప‌రిష్కారం ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కూర్చుని చ‌ర్చించుకుంటే త‌ప్పులే ద‌ని.. ఎవ‌రికి ఉన్న సందేహాలను వారు తెలుసుకునేందుకు, ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఇది చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ఓపెన్ ఆఫ‌రే అయినా.. తెలంగాణ ఏమేర‌కు ముందుకు వ‌స్తుంద‌న్న‌ది చూడాలి.

Tags:    

Similar News