విజయ్ కేబినెట్‌లో తెలుగు మహిళ.. టీడీపీ సోషల్ మీడియా నుంచి తమిళనాడు మంత్రివర్గం వరకూ కీర్తనా ప్రస్థానం!

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు.. మరో ఆసక్తికరమైన పేరు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది.;

Update: 2026-05-10 08:10 GMT

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైన రోజు.. మరో ఆసక్తికరమైన పేరు కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. ఆయన కేబినెట్‌లో చోటు దక్కించుకున్న యువ నాయకురాలు ఎస్. కీర్తనా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. ముఖ్యంగా తెలుగమ్మాయి కావడం, ఒకప్పుడు హైదరాబాద్‌లో టీడీపీ సోషల్ మీడియా టీంలో పనిచేయడం.. ఇప్పుడు తమిళనాడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

విరుద్‌నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి గ్రామానికి చెందిన కీర్తనా సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రులు, తాతలు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు. వీరి కుటుంబానికి రాజకీయ నేపథ్యం లేకపోయినా.. చదువులో ప్రతిభ కనబరిచిన ఆమె స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి, తరువాత పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ చేశారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక రాజకీయ వ్యూహాలపై ఆసక్తి పెంచుకున్న కీర్తనా.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందంలో చేరారు.

గోవా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో రాజకీయ విశ్లేషకురాలిగా పనిచేసిన ఆమె.. 2021 తమిళనాడు ఎన్నికల సమయంలో ఎం.కె. స్టాలిన్ టీంకు కూడా సేవలందించారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లో టీడీపీ సోషల్ మీడియా విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడ పనిచేసిన అనుభవంతో తెలుగుపై మంచి పట్టు సాధించిన కీర్తనా.. తెలుగు, తమిళ భాషల్లో సమానంగా మాట్లాడగల సామర్థ్యాన్ని పెంచుకున్నారు.

సోషల్ మీడియాలో ఆమె చురుకుదనం ఆమె రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్‌గా మారింది. శివకాశి నియోజకవర్గ సమస్యలపై వీడియోలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లిన కీర్తనా.. తక్కువ సమయంలోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. యువతలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. ఈ ఫాలోయింగ్‌ను గమనించిన విజయ్ టీం.. ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే శివకాశి అసెంబ్లీ టికెట్‌ను కీర్తనకు కేటాయించింది.

టికెట్ దక్కిన తరువాత కీర్తనా తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పలుచోట్ల తెలుగులో మాట్లాడి తెలుగు ఓటర్లను, యువతను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియా ప్రభావాన్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువచ్చిన ఆమె ప్రచారం శివకాశిలో మంచి ఫలితాన్ని ఇచ్చింది.

శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. అశోకన్‌పై సుమారు 11 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన కీర్తనా.. ఆ నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. తొలి ఎన్నికలకే ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ఇప్పుడు విజయ్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోవడం ఆమె రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా మారింది.

సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా మొదలైన ప్రయాణం.. ఇప్పుడు తమిళనాడు మంత్రివర్గం వరకూ చేరుకోవడంతో కీర్తనా పేరు తమిళ రాజకీయాల్లో ప్రత్యేకంగా వినిపిస్తోంది. యువత, మహిళలు, సోషల్ మీడియా శక్తిని రాజకీయ విజయంగా మలుచుకున్న కొత్తతరం నాయకురాలిగా ఆమెను పలువురు అభివర్ణిస్తున్నారు.

Tags:    

Similar News