రీ పోలింగ్ లేదు.. కామారెడ్డి ఫలితంతో ఉప ఎన్నికా లేదు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఒకటీ, రెండు విమర్శలను పక్కనపెడితే ఎన్నికల సంఘం అద్వితీయంగా నిర్వహించిందనే చెప్పాలి.

Update: 2023-12-04 14:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ఒకటీ, రెండు విమర్శలను పక్కనపెడితే ఎన్నికల సంఘం అద్వితీయంగా నిర్వహించిందనే చెప్పాలి. ఆరోపణలు వచ్చిన అధికారులను బదిలీ చేయడం.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన వారిపై వేటు వేయడం ఈసీ పనితీరును ప్రశంసించేలా చేశాయి. ఇక 71 శాతం వరకు పోలింగ్ నమోదుతో ఓటరూ ఓ మాదిరి చైతన్యం ప్రదర్శించారు. అందులోనూ 199 నియోజకవర్గాల్లో ఎక్కడా రీ పోలింగ్ జరగలేదు. దీన్నిబట్టే ఎన్నికలు ఎంత సాఫీగా సాగాయో స్పష్టమవుతోంది.

ఉప ఎన్నిక తప్పదనుకుంటే..

తెలంగాణ ఎన్నికల్లో ముగ్గురు నాయకులు రెండేసి నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ముగ్గురూ రాష్ట్ర స్థాయి వారే కావడంతో ఎక్కడైనా ఉప ఎన్నిక తప్పదనే పరిస్థితి వచ్చింది. అందులోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో ఈ అభిప్రాయం మరింత బలపడింది. కానీ, ఎలాగైతే రీ పోలింగ్ అవకాశం రాలేదో.. ఉప ఎన్నికకూ ఆ అవకాశం రాలేదు.

కేసీఆర్, రేవంత్ ఒక్కోచోట.. ఈటల రెండు చోట్లా..

తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రెండు సీట్లలో (గజ్వేల్, కామారెడ్డి) పోటీ చేశారు. ఆయనపై కామారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీకి దిగారు. ఇటు సొంత సీటు కొడంగల్ లోనూ రేవంత్ బరిలో నిలిచారు. ఇక బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ సైతం సొంత నియోజకవర్గం హుజూరాబాద్ తో పాటు గజ్వేల్ లో కేసీఆర్ ను ఢీకొట్టారు. ఫలితాల విషయానికి వస్తే రేవంత్, కేసీఆర్ కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. ఈటల రాజేందర్ 20 ఏళ్లుగా గెలుస్తున్న హుజూరాబాద్ తో పాటు ప్రయోగానికి పోయి గజ్వేల్ లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడా ఉప ఎన్నిక రాదని స్పష్టమైంది.

Read more!

ఉప ఎన్నిక తప్పించిన మొనగాడ

వాస్తవానికి కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండుచోట్లా గెలుస్తారనే అందరూ భావించారు. లేదంటే కామారెడ్డిలో రేవంత్ విజయం సాధించవచ్చని అనుకున్నారు. వీరిద్దరినీ అక్కడ ఓడించారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి. దీంతోనే ఉప ఎన్నిక తప్పింది. ఎందుకంటే.. కేసీఆర్, రేవంత్ లలో ఎవరు గెలిచినా ఒక సీటును అట్టిపెట్టుకునేవారు. మరో దానిని వదిలేస్తే అక్కడ ఉప ఎన్నిక జరిగేది. లేదా గజ్వేల్, హుజూరాబాద్ లో ఈటల గెలిచినా ఇలాగే అయ్యేది. ఈటల రెండుచోట్లా ఓడడంతో అసలు ఆ సమస్యే రాలేదు. ఉప ఎన్నికను తప్పించింది మాత్రం ముమ్మాటికీ కాటిపల్లి వెంకట రమణారెడ్డినే అని స్పష్టం అవుతోంది.

Tags:    

Similar News