ఆ 19 స్థానాల్లో కాంగ్రెస్ తర్జనభర్జన!

నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో తెలంగాణ ఎన్నికల వేడి మరోస్థాయికి చేరింది.;

Update: 2023-11-06 02:45 GMT

నామినేషన్ల ప్రక్రియ మొదలవడంతో తెలంగాణ ఎన్నికల వేడి మరోస్థాయికి చేరింది. రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. గెలుపు కోసం పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇక ఈ సారి తెలంగాణలో అధికారంపై కన్నేసిన కాంగ్రెస్ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. విజయం కోసం ప్రత్యేక ప్రణాళికలు, వ్యూహాలతో సాగుతోంది. ఇప్పటికే వంద నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించేసింది. కానీ మిగిలిన 19 స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేల్చేందుకు ఆ పార్టీ తర్జనభర్జన పడుతోందని తెలిసింది.

కాంగ్రెస్ లో టికెట్ల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఆశించిన స్థానాల్లో టికెట్లు రాకపోవడంతో చాలా మంది నేతలు పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పార్టీని వీడి వెళ్లిపోయారు. మరికొంతమంది నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 19 సీట్లపై పీఠముడి ఏర్పడింది. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్ చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

పెండింగ్లో ఉన్న ఈ 19 స్థానాల్లో నాలుగింటిని వామపక్షాలకు కేటాయించాలని కాంగ్రెస్ చూసింది. కానీ పొత్తు కుదరకపోవడంతో సీపీఎం సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక సీపీఐతో పొత్తు కోసం చర్చలు సాగుతూనే ఉన్నాయి. సీపీఐకు కేటాయించే సీట్లు ఎన్ని? అవి ఏవి? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంలో ఒక క్లారిటీ వస్తే కాంగ్రెస్ తలనొప్పి తగ్గినట్లే. మరోవైపు కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయబోతున్నట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బన్ సీటును షబ్బీర్ అలీకి కేటాయిస్తారని సమాచారం. బాన్సువాడ టికెట్ కు బాలరాజు, ఏనుగు రవీందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో అన్ని విషయాలు చర్చించి వీలైనంత తొందర్లో మిగిలిన 19 సీట్ల విషయం తెల్చే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైంది.

Tags:    

Similar News