విజృంభిస్తున్న కుక్కలు.. గంటకు 14 మంది!
సాధారణంగా కుక్కలను చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటూ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పెంపుడు కుక్కల సంగతి పక్కన పెడితే.. వీధి కుక్కల గురించి ఇప్పుడు అందరి ఆందోళన మొదలైంది.;
సాధారణంగా కుక్కలను చాలామంది ఇళ్లల్లో పెంచుకుంటూ కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక పెంపుడు కుక్కల సంగతి పక్కన పెడితే.. వీధి కుక్కల గురించి ఇప్పుడు అందరి ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో కుక్కల బెడదకు పరిష్కారం ఎప్పుడు ? అనే ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలం కావడంతో అటు తెలంగాణతో పాటు దేశంలోని చాలా ప్రాంతాలలో వీటి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఇది అతి పెద్ద సమస్యగా మారిపోయిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో గత ఏడాది సగటున గంటకు 14 మంది కుక్కకాటుకు గురయ్యారు. మొత్తం 13 మంది రేబిస్ బారిన పడి ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు.
ఈ వీధి కుక్కలు చిన్న పిల్లల్ని టార్గెట్ చేస్తూ దాడి చేస్తున్న వైనం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా వీధిలో ఆడుకుంటున్నప్పుడు, స్కూల్స్ కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా చిన్నపిల్లలే ఈ కుక్క కాటుకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో 1,21,997 మందిని, ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 87,366 మందిని కుక్కలు కరిచాయి. ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా చూసుకుంటే.. దాదాపు 37 లక్షల మంది ఈ కుక్కకాటు బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు ఢిల్లీలో కూడా ఈ ఏడాది ప్రధమార్ధంలో 35,198 మంది కుక్కకాటుకు గురవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.
ఇక్కడ మరో ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే.. డబ్ల్యూహెచ్వో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే రేబిస్ మరణాలలో 36% భారత్ నుండే కావడం గమనార్హం. బాధితులలో దాదాపు 15 ఏళ్ల లోపు వారే అధికంగా ఉన్నారు. ఇక వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఢిల్లీ రోడ్లపై కుక్కలు కనిపించకుండా వాటన్నింటినీ సంరక్షణ కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ సమస్యపై విచారణకు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ.. కుక్కలకు వీధుల్లో ఆహారం పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా ప్రజలను, వారి ప్రాణాలను పిల్లలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇస్తే.. కొంతమంది సెలబ్రిటీలు, జంతు ప్రేమికులు మాత్రం సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెట్టారు అంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జంతువు ప్రేమికులు రోడ్డెక్కి మరీ నిరసనలు వ్యక్తం చేశారు. ఇంకోవైపు కుక్క కాటు బాధితులు, వారి మద్దతుదారులు పోటాపోటీగా శునక ప్రేమికుల వాదనలకు ప్రతి వాదాలు చేస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1960 ప్రకారం ప్రజలకు హాని చేసే కుక్కలకు ప్రశాంత మరణాన్ని ఇవ్వాలి అని జిహెచ్ఎంసి చట్టం స్పష్టం చేసింది.
ఇకపోతే తెలంగాణలో 20 లక్షల కుక్కలు ఉండవచ్చని.. రెండు ఉండాల్సిన వీధిలో 20 వరకు కుక్కలు ఉన్నాయని.. సమస్యను కట్టడి చేయాలి అంటే సంతాన నిరోధక ఆపరేషన్లు చేయాలి అని కొంతమంది కామెంట్లు చేశారు. కానీ ప్రభుత్వాల వద్ద ఉన్న మౌలిక సౌకర్యాల సమస్యతో ఈ పద్ధతి అమలు కావట్లేదు. మరి భవిష్యత్తులోనైనా శునకాల సంఖ్యను తగ్గించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.