సజ్జనార్ వర్సెస్ ప్రవీణ్‌కుమార్.. రెండు రోజులు గడువు.. రాజకీయ–న్యాయ సమరం!
ఈ నోటీసులో మరో కీలక అంశం గడువు. నోటీసు అందిన తేదీ నుంచి కేవలం రెండు రోజుల్లోపు అన్ని వివరాలు సమర్పించాలని సజ్జనార్ ఆదేశించారు.;
తెలంగాణ రాజకీయాల్లో పోలీస్ వ్యవస్థ చుట్టూ సంచలన ఘట్టం తెరపైకి వచ్చింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్‌గా వీసీ సజ్జనార్ నేరుగా నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ నోటీసులు అందుకున్న వ్యక్తి మరెవరో కాదు.. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును సిట్ విచారించిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ప్రవీణ్‌కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఈ వివాదానికి కారణంగా మారాయి. తనపై, అలాగే ఇతర పోలీసు అధికారులపై గతంలో ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయంటూ బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టిన సజ్జనార్.. ‘ఆరోపణలు చేస్తే సరిపోదు, వివరాలు కావాలి’ అంటూ అధికారిక నోటీసులు జారీ చేశారు.
పూర్తి వివరాలు ఇవ్వాలంటూ డిమాండ్
నోటీసులో సజ్జనార్ స్పష్టంగా పేర్కొన్న అంశం ఒక్కటే.. ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవని, అవి వ్యక్తిగతంగా తన పరువుతో పాటు, సిట్ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్నాయని. ముఖ్యంగా 2015లో ఆంధ్రప్రదేశ్‌లో నమోదయ్యాయన్న కేసులను ప్రస్తావిస్తూ, అవి అప్పటి ‘ఓటుకు నోటు’ కేసుతో సంబంధం ఉందని ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆ కేసు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ముడిపడి ఉందన్న వాదనను ఆయన తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో.. ‘ఆ ఏడు కేసుల సంఖ్యలు ఏమిటి? ఎక్కడ నమోదయ్యాయి? ఏ సెక్షన్ల కింద? ప్రస్తుతం వాటి స్థితి ఏంటి?’ అన్న పూర్తి, నిర్ధిష్ట వివరాలు ఇవ్వాలని సజ్జనార్ కోరారు. కేవలం రాజకీయ వ్యాఖ్యలుగా కాకుండా, చట్టపరమైన ఆధారాలతోనే మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు.
రెండు రోజులు..
ఈ నోటీసులో మరో కీలక అంశం గడువు. నోటీసు అందిన తేదీ నుంచి కేవలం రెండు రోజుల్లోపు అన్ని వివరాలు సమర్పించాలని సజ్జనార్ ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో బహిరంగంగా పోస్ట్ చేశాడు. రెండు రోజుల్లో స్పందించకుంటే.. సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టంగా హెచ్చరించారు. సిట్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో, ఆధారాలు లేకుండా బహిరంగంగా ఆరోపణలు చేయడం దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే కాకుండా, వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇవి ‘నిర్లక్ష్యమైనవి, తప్పుదోవ పట్టించేవి, పరువు నష్టం కలిగించేవి’ అని నోటీసులో తీవ్ర పదజాలంతో పేర్కొన్నారు.
రాజకీయ అర్థాలు ఏమిటి?
ఈ పరిణామం ఇద్దరు మాజీ–ప్రస్తుత ఐపీఎస్ అధికారుల మధ్య వివాదంగా మాత్రమే చూడలేం. ఫోన్ ట్యాపింగ్ కేసు, బీఆర్ఎస్ నేతల విచారణ, ప్రభుత్వ–విపక్షాల మధ్య సాగుతున్న ఆరోపణ ప్రత్యారోపణల నేపథ్యంలో ఇది రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశం ఉంది. ప్రవీణ్‌కుమార్ స్పందన ఎలా ఉండబోతోంది? రెండు రోజుల్లో ఆయన ఆధారాలతో సమాధానం ఇస్తారా? లేక ఈ వ్యవహారం న్యాయపరమైన మలుపు తిరుగుతుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది. ఒకవైపు ‘ఆరోపణలకు ఆధారాలు చూపాలి’ అనే సజ్జనార్ కఠిన వైఖరి.. మరోవైపు ‘పాత కేసులను గుర్తు చేయడం రాజకీయ వేధింపులేనా?’ అనే ప్రవీణ్‌కుమార్ వాదన.. ఈ రెండింటి మధ్య వచ్చే తదుపరి అడుగు ఏమిటన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠను పెంచుతోంది.