అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో.. ఎయిరిండియాకు బీమా పరిహారం.. ఎంత అందిందంటే?
ప్రమాదం తర్వాత వెంటనే బీమా అంచనా ప్రక్రియ ప్రారంభమైంది. విమానం పూర్తిగా నష్టపోవడంతో ‘హల్ లాస్’ కింద బీమా సంస్థలు పరిహారం చెల్లించాయి.;
అహ్మదాబాద్‌లో గతేడాది చోటుచేసుకున్న దిగ్భ్రాంతికర విమాన ప్రమాద ఘటనలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా (Air India)కు భారీ బీమా పరిహారం అందింది. ఈ ప్రమాదానికి సంబంధించి పలు బీమా సంస్థలు, రీఇన్సూరర్ల నుంచి మొత్తం 125 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.1,100 కోట్లు)కు పైగా చెల్లించినట్లు ఇన్సూరెన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని ఇంగ్లిష్ మీడియా కథనాలు ధృవీకరించాయి. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం, టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే సాంకేతిక సమస్యలతో నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. దురదృష్టవశాత్తూ, అది ఒక మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడడంతో ప్రాణాల సంఖ్య మరింత పెరిగింది. ఈ ఘటనలో విమానం పూర్తిగా ధ్వంసమవడంతో పాటు భారీ ప్రాణనష్టం సంభవించింది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది కలిపి 242 మంది ఉండగా, ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాదం తర్వత బీమా..
ప్రమాదం తర్వాత వెంటనే బీమా అంచనా ప్రక్రియ ప్రారంభమైంది. విమానం పూర్తిగా నష్టపోవడంతో ‘హల్ లాస్’ కింద బీమా సంస్థలు పరిహారం చెల్లించాయి. ఇందులో ప్రధాన బీమా సంస్థలతో పాటు అంతర్జాతీయ రీఇన్సూరర్లు కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరందరూ కలిపి ఎయిర్ ఇండియాకు రూ.1,100 కోట్లకు మించిన మొత్తాన్ని ఇప్పటికే చెల్లించినట్లు సమాచారం. ఇదే సమయంలో, ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతుల బంధువులకు సుమారు 25 మిలియన్ డాలర్లు (రూ.200 కోట్లకు పైగా) చెల్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇన్సూరెన్స్ వర్గాలు తెలిపాయి. ఈ పరిహార ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, బాధితుల సంఖ్య, న్యాయపరమైన అంశాలను బట్టి ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముందుకువ చ్చిన టాటా గ్రూప్..
విమాన ప్రమాదం హాస్టల్‌పై పడడంతో, అక్కడ ఉన్న విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు టాటా గ్రూప్ (Tata Group) ముందుకొచ్చింది. ఎయిర్ ఇండియాకు మాతృసంస్థగా ఉన్న టాటా గ్రూప్ ప్రత్యేకంగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ద్వారా మృతుల కుటుంబాలకు సహాయం, క్షతగాత్రుల వైద్య ఖర్చులు, అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న మెడికల్ కాలేజీ భవనాల పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. అంతే కాకుండా.., విమాన శకలాలపై సమీప ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాల మరమ్మతుకు ఈ ట్రస్ట్ నిధులను వినియోగిస్తున్నారు. ఇది కేవలం బీమా పరిహారం వరకే పరిమితం కాకుండా, మానవీయ కోణంలో బాధితులకు అండగా నిలిచే ప్రయత్నంగా భావిస్తున్నారు.
ఈ ఘటన భారత విమానయాన చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటిగా నిలిచింది. బీమా పరిహారం, ట్రస్ట్ ద్వారా అందుతున్న సాయం బాధను పూర్తిగా తుడిచివేయలేకపోయినా, బాధిత కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరటనిచ్చే ప్రయత్నంగా కనిపిస్తోంది. అదే సమయంలో, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.