ఆ మూడు గ్రామాల్లో రాత్రికి రాత్రే వందల సంఖ్యలో శునకాలు మాయం.. జరిగింది ఇదే..
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో ఉన్న ఫరీద్‌పేట్, బండరామేశ్వర్‌పల్లి, భవానీపేట వాడి గ్రామాల్లో ఇదే జరిగింది.;
ఎన్నికల వేళ ఇచ్చే హామీలు నెరవేర్చడం నాయకులకు సవాల్ తో కూడుకున్నది కానీ నెరవేరిస్తే కటకటాలపాలవుతారంటే హామీలు ఇస్తారా? సమస్య ఎంతటిదైనా విలువలతో పరిష్కరించాలి గానీ ఇష్టం వచ్చిన రీతిలో చేయడం వల్ల పాలకుడైనా చట్టం ముందు నిలబడాల్సిందే. నాయకులు సాధారణంగా తాము సులభంగా అమలు చేయగలిగిన, తమకు ఇబ్బంది కలగని హామీలకే ముందుగా ప్రాధాన్యం ఇస్తారు. వాటిని వేగంగా పూర్తి చేసి “మేము మాట నిలబెట్టుకున్నాం” అని ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అదే హామీ… నాయకులను న్యాయస్థానాల ముందు నిలబెట్టే స్థాయికి తీసుకెళ్తుంది. తెలంగాణలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన అలాంటిదే.
గ్రామంలోని సమస్యలపై హామీ..
గత డిసెంబరు-2025లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేక చోట్ల సాధారణ ఎన్నికలను తలపించేలా జరిగాయి. అభ్యర్థులు డబ్బులు పంచారు, హామీల వర్షం కురిపించారు. గ్రామస్థుల రోజువారీ సమస్యలనే ప్రధానంగా ఎత్తిపట్టారు. అలాంటి సమస్యల్లో ఒకటి వీధి కుక్కల బెడద. రాత్రివేళ భయం, పిల్లల భద్రత, వృద్ధుల ఆందోళన.. ఈ అంశాన్ని రాజకీయంగా బలంగా వాడుకున్నారు కొందరు సర్పంచ్ అభ్యర్థులు.
మూడు గ్రామల సర్పంచులు చేసింది అమానవీయమే?
కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండల పరిధిలో ఉన్న ఫరీద్‌పేట్, బండరామేశ్వర్‌పల్లి, భవానీపేట వాడి గ్రామాల్లో ఇదే జరిగింది. “మమ్మల్ని గెలిపిస్తే వీధి కుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరిస్తాం” అనే హామీ ప్రజల్లో గట్టిగా పడింది. ఈ మాటలే ఆయా అభ్యర్థులకు గెలుపు తెచ్చాయి. ప్రజలు కూడా హామీని గుర్తుంచుకున్నారు. ఎన్నికలు పూర్తయ్యాక “ఇప్పుడు మా సమస్యను తీర్చండి” అంటూ కొత్తగా ఎన్నికైన సర్పంచులను కోరారు. అక్కడి నుంచే కథ మలుపు తిరిగింది. నాలుగు గ్రామాల్లోనూ రాత్రికి రాత్రే వీధి కుక్కలు కనిపించకుండా పోయాయి. మొదట ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. హామీ నెరవేరిందన్న సంతృప్తి. కానీ అదే సమయంలో జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తల్లో అనుమానం మొదలైంది. కుక్కలు ఎక్కడికి వెళ్లాయి? ఎవరు తరలించారు? అన్న ప్రశ్నలు లేవనెత్తారు.
షాక్ గురి చేసిన ఘటన..
విచారణలో బయటపడిన విషయం మాత్రం గ్రామాలను, పాలకులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. వీధి కుక్కలను రాత్రివేళ హత్య చేసి, సమీపంలోని ట్రాక్ పక్కన పూడ్చిపెట్టారన్న ఆరోపణలు నిజమని తేలాయి. పోలీసులు, జంతు ప్రేమికుల సహాయంతో మొత్తం 642 వీధి కుక్కల కళేబరాలను వెలికి తీశారు. ఇది కేవలం ఒక పరిపాలనా తప్పిదం కాదు.. మానవత్వం మీదే ప్రశ్నార్థకం వేసిన ఘటనగా మారింది.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో కొత్తగా ఎన్నికైన సర్పంచుల హస్తం ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. పండుగ సమయం అయినా అరెస్టులు తప్పవన్న సంకేతాలు వెలువడ్డాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చామనే భావనలో ఉన్న ప్రజాప్రతినిధులు.. ఇప్పుడు అదే హామీ కారణంగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.
పరిష్కారం ఇలా కాదు..
ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తోంది. ప్రజా సమస్యను పరిష్కరించడం అంటే ఎలాంటి మార్గమైనా సరే ఎన్నుకోవచ్చా.. ప్రజాస్వామ్యంలో అధికారం అంటే కేవలం ఓటుతో వచ్చే బలం మాత్రమేనా, లేక బాధ్యత కూడా దానితోపాటు రావాలా? వీధి కుక్కల సమస్య నిజమే. కానీ దానికి పరిష్కారం హింసా మార్గమా? చట్టబద్ధమైన పద్ధతులు, పశుసంరక్షణ నిబంధనలు, మానవీయ చర్యలు ఎందుకు ఆలోచించలేదు? అని విశ్లేషకులు గట్టిగానే సూచనలు చేస్తున్నారు.
గ్రామ పాలన అనేది చిన్న పరిపాలనలా కనిపించినా, దాని నిర్ణయాల ప్రభావం పెద్దదే. ఒక సర్పంచ్ తీసుకునే నిర్ణయం గ్రామ సంస్కృతిని, విలువలను ప్రతిబింబిస్తుంది. ఈ ఘటన చెబుతున్నది ఒక్కటే హామీ నెరవేర్చడమే రాజకీయ విజయం కాదు. అది ఎలా నెరవేర్చామన్నదే అసలైన పరీక్ష. లేదంటే, ఓటు కోసం ఇచ్చిన హామీ.. చివరికి చట్టం ముందు దోషిగా చేస్తుంది.