తెలంగాణలో తరుముకొస్తున్న ఉప ఎన్నికలు.. దేశ చరిత్రలో సంచలనం కాబోతుందా?
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.;
తెలంగాణ రాజకీయాల్లో వేడి చల్లారడం లేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడం, వారిపై అనర్హత వేటు వేసేలా ఆ పార్టీ చేస్తున్న న్యాయపోరాటంతో తెలంగాణ రాజకీయాలు నిత్యం వాడివేడిగా సాగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన పిటిషన్లపై విచారణ జరిపి.. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమారుకు గడువు విధించింది. వచ్చేనెల 20లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సివుంది. ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇలాంటి సూచనలు చేసినా, స్పీకర్ తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే ఈ సారి స్పీకర్ పై ఒత్తిడి పెంచేలా సుప్రీం వ్యాఖ్యలు చేయడం, అదే సమయంలో కలకత్తా హైకోర్టు పశ్చిమబెంగాల్ కు చెందిన ఓ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయడంతో రాజకీయం వేడెక్కింది. సుప్రీం ఆదేశాలతో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆయన నిర్ణయాలపై సుప్రీం ఎలా స్పందిస్తుంది? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు గమనిస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు సిద్ధమయ్యే పరిస్థితులు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయమే ఫైనల్ అంటున్నారు. మొత్తం అందరితో ఒకేసారి రాజీనామాలు చేయించడమా, లేక గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, వరంగల్ ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఆ రెండు నియోజకవర్గాలకే ఎన్నికలు జరిగేటట్లు చూడటమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్ లో ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై వేటు వేస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరించినందున.. ఆ తీర్పు ప్రకారం తెలంగాణ ఎమ్మెల్యేల విషయంలో కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయా? అనేది తీవ్ర చర్చగా మారింది. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం మొత్తం పదిస్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం చేస్తున్నాయి. డిసెంబరు 20లోగా పది మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయాలని లేదంటే.. జనవరిలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుని, ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఊహిస్తున్నారు. ఇదే జరిగితే దేశ రాజకీయాల్లో పెను సంచలనం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
పార్టీ ఫిరాయింపులపై ఒకేసారి పది మంది ఎమ్మెల్యేలపై వేటు వేయడం అంటే అంత ఈజీ కాదన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో స్పీకర్ తప్ప వేరే ఎవరూ నిర్ణయం తీసుకోలేరని కాంగ్రెస్ వర్గాలు వాదిస్తున్నాయి. అయితే కలకత్తా తీర్పు తర్వాత వారిలోనూ టెన్షన్ కనిపిస్తోందని అంటున్నారు. అయితే పది మంది కాకపోయినా, ఇద్దరు లేదా ముగ్గురిపై వేటు పడే అవకాశాలు ఉన్నందున వారితో సభ్యత్వాలకు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని కాంగ్రెస్ అగ్రనేతలు సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఏదిఏమైనా డిసెంబరులో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సివున్నందున వచ్చే ఏడాదిలో తెలంగాణలో మరో ఉప ఎన్నికల సమరం జరగడం ఖాయమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే పది నియోజకవర్గాలకు ఎన్నికలకు వెళ్తారా? లేదా పరిమితంగానే రాజీనామాల నిర్ణయం ఉంటుందా? అనేది చూడాల్సివుందని అంటున్నారు.