కాంగ్రెస్ మంత్రుల్లో గుబులు..? ముఖ్యమంత్రిపై అనుమానాలు రేకెత్తించిన బీఆర్ఎస్
బీఆర్ఎస్ లీడర్లు చేసిన ట్యాపింగ్ ఆరోపణలతో క్యాబినెట్‌లో కలకలం నడుస్తూనే ఉంది. ఇక అధికార కాంగ్రెస్ నేతల్లో కూడా ట్యాపింగ్ గుబులు టెన్షన్ పెడుతోందట.;
ఫోన్ ట్యాపింగ్ తెలంగాణ పాలిటిక్స్ ట్రెండింగ్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ సిట్‌తో దర్యాప్తు చేయిస్తోంది. దీనిపై రివర్స్ అటాక్ ప్రారంభించింది . మంత్రులతోపాటు అపోజిషన్ లీడర్ల ఫోన్లను ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. ఫోన్ ట్యాంపింగ్ కేసుపై విచారణ చేయిస్తున్న ప్రభుత్వం.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగించేలా అడుగులు వేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. రోజుకో లీకు ఇస్తూ బీఆర్ఎస్ నేతలను సైతం కేటీఆర్ నమ్మలేదని, వారిలో అసంతృప్తి చెలరేగేలా ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. దీంతో కేటీఆర్ రివర్స్ అటాక్ కు ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
రేవంత్ రెడ్డిని ఇరికించేలా బీఆర్ఎస్ ప్లాన్
కాంగ్రెస్ వ్యూహాలకు చెక్ చెప్పేలా అడుగులు వేస్తున్న బీఆర్ఎస్ తాము ఫోన్ ట్యాప్ చేయలేదని చెప్పడం కంటే, అదే ఉచ్చులోకి సీఎం రేవంత్ రెడ్డి లాగాలని భావిస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమపై ఫోన్ ట్యాపింగ్ బురద జల్లుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేస్తున్నారని ప్రచారం చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేయాలని గులాబీ నేతలు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు కాంగ్రెస్ అంతర్గత విభేదాలను అస్త్రంగా చేసుకున్నారని అంటున్నారు. తన పదవికి ఎసరు పెడతారేమోనన్న అనుమానంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేతలు, మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం ద్వారా కాంగ్రెస్ సీనియర్లలో అనుమానాలు రేకెత్తించాలని బీఆర్ఎస్ భావిస్తోందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్‌పై లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరినట్లు చెబుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత, రిటైర్డ్ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా సీఎం ట్యాప్ చేయిస్తున్నారని చెప్పడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
రివర్స్ అటాక్ ఎంచుకోవడానికి కారణమిదేనా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి విమర్శలు కూడా బీఆర్ఎస్ వ్యూహంగానే చెబుతున్నారు. తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తున్నారని.. 16 మంది హీరోయిన్లు ఫోన్లు కూడా రహస్యంగా వింటున్నారని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. ఈ విమర్శల ద్వారా బీఆర్ఎస్ పై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే లక్ష్యంగా కనిపిస్తోందని అంటున్నారు. తమ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరగలేదని..ఒకవేళ ట్యాపింగ్ జరిగినా తనకు సంబంధం లేదని కేటీఆర్ ఎంత చెప్తున్నా అనుకున్నంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదని, సిట్ దర్యాప్తుపై లీకులతో అడ్డగోలు ప్రచారం జరుగుతోందని గ్రహించిన బీఆర్ఎస్ అధినాయకత్వం రివర్స్ అటాక్ చేయడమే మేలన్న ఆలోచనకు వచ్చిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు మంత్రులు మాట్లాడుకున్న ఫోన్ సంభాషణను సీఎం విన్నారని.. ప్రైవేటు హ్యాకర్లతో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పడం ద్వారా ప్రభుత్వంపై మంత్రుల్లోనూ అనుమానాలు రేకెత్తించి గందరగోళ వాతావరణం సృష్టించాలనేది వ్యూహంగా చెబుతున్నారు. ఈ కారణంగానే సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రులు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని.. అందువల్లే శుక్రవారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వాయిదా పడిందని బీఆర్ఎస్ చెప్పడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సంచలనంగా ఫోన్ ట్యాపింగ్
సీఎం రేవంత్ రెడ్డి తన సహచర మంత్రుల ఫోన్లతో పాటు హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఎవరేం మాట్లాడుకుంటున్నారో వింటున్నారంటున్న బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం ఎంతుందో గానీ..తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సంచలనం రేపుతోంది. బీఆర్ఎస్ లీడర్లు చేసిన ట్యాపింగ్ ఆరోపణలతో క్యాబినెట్‌లో కలకలం నడుస్తూనే ఉంది. ఇక అధికార కాంగ్రెస్ నేతల్లో కూడా ట్యాపింగ్ గుబులు టెన్షన్ పెడుతోందట. గులాబీ నేతలు చెప్తున్నట్లు నిజంగానే ట్యాపింగ్ చేస్తున్నారా.? తాము ఎవరెవరితో మాట్లాడుతున్నామో, ఎవరెవరిని కలుస్తున్నామో సీఎం రేవంత్ రెడ్డి అంతా తెలుసుకుంటున్నారా అని మంత్రులతో సహా పార్టీ లీడర్లలో కూడా అనుమానం వ్యక్తమవుతోందట. అయితే కేసీఆర్ హయాంలో జరిగిన ట్యాపింగ్ భాగోతంపై నిజాలు బయటకు రావొద్దనే..బీఆర్ఎస్ నేతలు అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారని కూడా కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య జరుగుతోన్న ఈ ఫోన్ ట్యాపింగ్ ఆటలో పైచేయి సాధించేదెవరో చూడాల్సివుందని అంటున్నారు.