లెక్కల్లో తేడా ఉంటే 8 ఎందుకు.. 17 గెలిచే వాళ్లుగా మహేశా?

గడిచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ జరిగిందంటూ జాతీయస్థాయిలో మోడీ సర్కారుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-08-26 05:30 GMT

తెలివిగా దొంగతనం చేసే అవకాశం లభిస్తే.. అడ్డంగా బుక్ కాకుండా ఉండేలా.. అలా అని పెద్దగా లాభపడకుండా దోపిడీలు చేయటం ఉండదు కదా? దొంగ లక్ష్యం ఎంత కుదిరితే అంత ఎక్కువగా దోచుకోవటమే కదా? అలాంటప్పుడు ఓవైపు దొంగతనం జరిగిందని ఆరోపిస్తూ.. వినిపిస్తున్న వాదనకు లాజిక్ అందేలా ఉండాలి కదా? అలాంటిదేమీ లేకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే అభాసుపాలు అవుతామన్న ఆలోచన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు.. అయ్యో అనుకోకుండా ఉండలేం.

గడిచిన కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీ జరిగిందంటూ జాతీయస్థాయిలో మోడీ సర్కారుపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తమ బిగ్ బాస్ ను స్ఫూర్తిగా తీసుకున్న తెలంగాణ పార్టీ రథసారధి మరింతలా రియాక్టు అవుతున్నారు. నిజానికి ఆ తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకుంటే.. అధినాయకుడి తరహాలో నడవాలని డిసైడ్ అయినప్పుడు అందుకు తగ్గట్లు లాజిక్ ను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

అదేమీ లేకుండా నోటి మాట అనేయటమే లక్ష్యంగా మాట్లాడితే.. ఘాటుకౌంటర్లు పడతాయి. ఇప్పుడు ఆయన మాటలకు అలాంటి పరిస్థితే ఎదురవుతోంది. ఓట్ల చోరీతో మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయినట్లుగా ఆరోపించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్.. తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ తరఫున గెలవటంపై తనకు అనుమానాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఒకవేళ మహేశ్ కుమార్ మాటల్లో నిజమే ఉందని భావించినప్పుడు.. తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లోనూ గెలిచే అవకాశం ఉంటుంది కదా? సరే.. అన్నింట్లోనూ గెలిస్తే అనుమానం రావొచ్చని అనుకుందాం.

అలాంటప్పుడు హైదరాబాద్ ఎంపీ స్థానంతో పాటు.. మరికొన్ని వదిలేసి.. ఎంతలేదన్నా పద్నాలుగుకు తగ్గకుండా గెలవటానికి పావులు కదుపుతారు కదా? ఈ చిన్న లాజిక్ వదిలేసి.. గెలిచిన ఎనిమిది స్థానాలపై సందేహాలు ఉన్నాయని వ్యాఖ్యానించటంలో అర్థముందా? అని ప్రశ్నిస్తున్నారు. కీలక స్థానాల్లో ఉన్న వారు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నప్పుడు.. అందులో అంతో ఇంతో విషయం ఉండాలి. అలాంటిదేమీ లేకుండా మాట్లాడటం వల్ల అభాసుపాలు కావటం మినహా మరేమీ ఉండదు. ఈ విషయాన్ని మహేశ్ కుమార్ గౌడ్ ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్న మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News