కొండా సురేఖా ఓఎస్డీ తొలగింపు.. కారణం మేడారమేనా..?
అయితే టెండర్ల విషయంతో పాటు ప్రభుత్వ పనుల్లో ఓఎస్డీ ప్రధానంగా కలుగజేసుకుంటున్నారని నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు;
రాష్ట్ర అటవీ పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో ఓఎస్డీగా పని చేస్తున్న సుమంత్ ను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం (అక్టోబర్ 15) ఉత్తర్వులు జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కొండా మురళి పొంగులేటిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రాంతాన్ని వదిలి వరంగల్ జిల్లా వైపు చూస్తున్నారని, మేడారం టెండర్లు కూడా అక్రమమేఅని ఆయన ఇటీవల విలేకరుల ఎదుట విమర్శల వర్షం కురిపించారు. దీంతో ప్రభుత్వం మేడారం టెండర్ల విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. అయితే టెండర్ల విషయంతో పాటు ప్రభుత్వ పనుల్లో ఓఎస్డీ ప్రధానంగా కలుగజేసుకుంటున్నారని నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించారు.
ఓఎస్డీ సుమంత్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అతడు మంత్రుల మధ్య అంతర్గత చిచ్చు రేపుతున్నాడని, మేడారం టెండర్ల విషయంలో ఆయన ప్రధాన పాత్ర పోషించినట్లు, అలాగే ప్రభుత్వ అంతర్గత నిర్ణయాలను మీడియాకు లీక్ చేస్తున్నాడనే సమాచారం ఉంది. ముఖ్యంగా మేడారం టెండర్లలో అవకతవకలు, సెటిల్‌మెంట్ వ్యవహారాలు ఇవన్నీ కలసి పరిస్థితి మరింత తీవ్రతరం చేశాయి.
సుమంత్ వ్యవహారంపై సీఎం స్వయంగా సీరియస్‌గా స్పందించారు. “ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వ్యక్తి అధికారంలో ఉండలేడు” అనే ధోరణితో వెంటనే తొలగింపు ఆదేశాలు జారీ చేశారు. మేడారం జాతర వంటి భారీ ఆధ్యాత్మిక ఉత్సవాలు కేవలం భక్తి కార్యక్రమాలు మాత్రమే కాదు. వాటిలో కోట్ల రూపాయల టెండర్లు, కాంట్రాక్టులు, రాజకీయ–ఆర్థిక ఆసక్తులు దాగి ఉంటాయి.
ఇటీవల మేడారం ఏర్పాట్లలో జరిగిన ‘గోల్‌మాల్’పై వచ్చిన ఆరోపణలు, సుమంత్ పేరును మరింత వివాదాస్పదం చేశాయి. ఒక ఓఎస్డీ బాధ్యత అంటే.. మంత్రికి పరిపాలనా సహకారం ఇవ్వడం, నిర్ణయాలను సమన్వయం చేయడం.. కానీ ఆ స్థానం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయడం లేదా వ్యక్తి గత ప్రయోజనాల కోసం వాడుకోవడం ప్రారంభిస్తే, అది పరిపాలన వ్యవస్థను కూలదీసే ప్రమాదంగా మారుతుంది.
సుమంత్ ఎలా కీలక వ్యక్తిగా మారాడు..
సుమంత్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కాంట్రాక్టు ఆధారంగా పనిచేశాడు. 2023, డిసెంబర్‌లో కొండా సురేఖ వ్యక్తిగత ఓఎస్డీగా నియమితుడయ్యాడు. అతని పనితీరు మొదట్లో చురుకుగా ఉంది. అయితే, కాలక్రమంలో ఆయన శాఖా పరమైన నిర్ణయాల్లో, టెండర్ ప్రక్రియల్లో, మంత్రుల మధ్య అంతర్గత సమాచారంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇలాంటి సందర్భాల్లో సీఎం కఠిన చర్యలు తీసుకున్నాడు.
సిఎం తీసుకున్న ఈ చర్య కేవలం ఒక వ్యక్తిపై కాదు.. మొత్తం ప్రభుత్వ యంత్రాంగానికి పంపిన సందేశంగా భావించవచ్చు. ‘వ్యక్తిగత విశ్వాసం కంటే, పరిపాలనా నిబద్ధత ముఖ్యం.’ అని సీఎం చెప్పకనే చెప్పారు. ప్రజా వ్యవస్థలో ఉన్న ప్రతి అధికారి, తాను ఎవరికి వ్యక్తిగతంగా విధేయుడో కంటే, రాజ్యాంగానికి విధేయుడని గుర్తుంచుకోవాలి.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే, లీకులు ఇచ్చే, దోపిడీ చేసే అధికారులపై ఇకపై సహనంగా వ్యవహరించమని సంకేతం ఈ నిర్ణయంతో స్పష్టంగా తెలుస్తుంది. కొండా సురేఖ ఓఎస్డీ తొలగింపు ఒక పరిణామం మాత్రమే కాదు.. అది సర్కారు యంత్రాంగం పునరుద్ధరణకు ఆరంభ సంకేతం.