కేవలం 2.5 ఏళ్లలో తెలంగాణలో 2 ఎయిర్ పోర్టులు?

ఈ రెండు కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించిన టెండర్లను ఈ ఏడాది చివరికి పిలిచి.. నిర్మాణాన్ని చేపట్టేందుకు వీలుగా చర్యలు షురూ అయ్యాయి.;

Update: 2025-06-08 08:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో పోలిస్తే ఏపీలో పెద్ద ఎత్తున ఎయిర్ పోర్టుల కనిపిస్తాయి. అయితే.. ఏపీ విమానాశ్రయాలు మొత్తం రద్దీని కలిపినా.. తెలంగాణలోని శంషాబాద్ ఎయిర్ పోర్టు రద్దీలో 20 శాతం కూడా ఉండదు. అయితే.. తెలంగాణలో హైదరాబాద్ శివారున ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్టు తప్పించి.. మరే విమానాశ్రయం లేకపోవటం ఒక కొరతగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ లోటును తీర్చేలా కేంద్రం.. రాష్ట్రం ఒక ప్లాన్ వడివడిగా వేస్తోంది.

2027 చివరి నాటికి తెలంగాణలో రెండు కొత్త ఎయిర్ పోర్టుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఒకటి వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న నిజాం కాలం నాటి ఎయిర్ స్ట్రిప్ కాగా.. రెండోది అదిలాబాద్ పట్టణ శివారులోని శాంతినగర్ లో ఉన్న ఇండియన్ ఎయిర్ పోర్టు ఆధ్వర్యంలోని హెలిపోర్టుల స్థానంలో కొత్త ఎయిర్ పోర్టును నిర్మించాలని భావిస్తున్నారు.

ఈ రెండు కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించిన టెండర్లను ఈ ఏడాది చివరికి పిలిచి.. నిర్మాణాన్ని చేపట్టేందుకు వీలుగా చర్యలు షురూ అయ్యాయి. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో ఉండే వరంగల్ ఎయిర్ పోర్టును ఏఏఐ (ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) సొంతంగా నిర్మిస్తుంటే.. అదిలాబాద్ ఎయిర్ పోర్టు విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ కొత్త ఎయిర్ పోర్టులను ఆధునిక విమానాశ్రయాలుగా నిర్మించనున్నారు.

మామూలుగా అయితే.. కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించే సమయంలో తొలుత చిన్న విమానాలు దిగేలా.. తర్వాతి రోజుల్లో దాన్ని విస్తరించేలా చేస్తారు. అయితే.. అందుకుభిన్నంగా ఒకేసారి పెద్ద ఎయిర్ పోర్టులను నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ప్రతిపాదనకు ఏఏఐ కూడా ఓకే చెప్పింది. అంతేకాదు.. రాత్రివేళలోనూ విమానాలు వచ్చి వెళ్లే వసలుతు ఉండాలన్న సీఎం అభిలాషకు కేంద్రం సానుకూల స్పందన వ్యక్తం చేసింది.

బోయింగ్ 737, ఎయిర్ బస్ 320 లాంటి పెద్దవిమానాలు వచ్చి పోయేందుకు వీలుగా దాదాపు 3 వేల మీటర్ల పొడవైన రన్ వేలను నిర్మిస్తారు.నైట్ ల్యాండింగ్ కు.. టేకాఫ్ కు వీలుగా ఆధునిక మెకానిజం ఏర్పాటు చేస్తారు. వరంగల్ విమానాశ్రయాన్ని వెయ్యి ఎకరాల్లో.. అదిలాబాద్ ఎయిర్ పోర్టును 600 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఇందుకు రూ.500 - 600 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఒకేసారి 500 మంది ప్రయాణించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ను కేంద్రం అందిస్తుంది. ఎయిర్ పోర్టు నిర్వహణ వ్యయంలో కేంద్రం 80 శాతం.. రాష్ట్రం 20 శాతం భరిస్తాయి.

వరంగల్ లోని పాత ఎయిర్ స్ట్రిప్ నకు సంబంధించి 696.1 ఎకరాలు అందుబాటులో ఉండగా.. మరో 280 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో సమీపంలోని రెండు ఊళ్లను ఖాళీ చేయించి.. ఆ భూమిని సేకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. అదిలాబాద్ ఎయిర్ పోర్టు కోసం ప్రస్తుతం 369 ఎకరాలు అందుబాటులో ఉండగా.. మరో 250 ఎకరాల్ని సేకరించి ఎయిర్ పోర్టు నిర్మిస్తారు. ఈ రెండు ఎయిర్ పోర్టులను 24 నెలల్లో పూర్తి అవుతాయని ఏఏఐ చెబుతుండగా.. 18 నెలల్లో పూర్తి చేయాలని సీఎం రేవంత్ కోరుతున్నారు. ఏమైనా.. 2027 చివరకు తెలంగాణలో రెండు కొత్త ఎయిర్ పోర్టులు అందుబాటులోకి వస్తాయని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News