మునిసిపల్ చట్ట సవరణ బిల్లు ఓకే.. దీంతో ఏంటి లాభం!
తెలంగాణ అసెంబ్లీ తాజాగా మునిసిపల్ చట్టాన్ని సవరిస్తూ.. తెచ్చిన కీలక బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.;
తెలంగాణ అసెంబ్లీ తాజాగా మునిసిపల్ చట్టాన్ని సవరిస్తూ.. తెచ్చిన కీలక బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. దీనిపై సుదీర్ఘంగా కాకపోయినా.. కొంత మేరకు చర్చ సాగింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు.. ప్రతిపక్షం నుంచి కేటీఆర్, హరీష్‌రావు, గంగుల కమలాకర్.. కీలక సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇక, 2014లో ఒకసారి సవరించిన ఈ బిల్లును తాజాగా మరోసారి సవరించారు. దీనిలో ప్రధానంగా కేసీఆర్ అప్పట్లో విధించిన రిజర్వేషన్‌పై సీలింగ్‌ను ఎత్తేశారు.
అదేవిధంగా ఎల్ ఆర్ ఎస్(లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం) కింద ప్రభుత్వం ఇచ్చే నిధుల విషయంలోనూ స్వేచ్ఛను కల్పించారు. ఈ రెండు అంశాలు కీలకంగా మునిసిపల్ చట్ట సవరణకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, నుంచి రిజర్వేషన్ సీలింగ్ ఉండదు. తద్వారా.. మునిసిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి స్వేచ్ఛ కల్పిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. వచ్చేనెల ఆఖరులో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ సవరణ కీలకంగా మారనుంది. తద్వారా ఇప్పటి వరకు 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ సీలింగ్ ఇక తొలిగిపోయి.. మరింత మందికి మేలు జరగనుంది.
అంతేకాదు.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా కూడా ఈబిల్లు దోహద పడనుంది. అదే విధంగా ఎల్ ఆర్ ఎస్ నిధుల విషయంలోనూ ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలన్న విషయాన్నిబిల్లులో పేర్కొన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు వసూలు చేసే పన్నులు, శిస్తుల్లో కొంత మొత్తాన్ని మునిసిపాలిటీ ల స్థాయిని బట్టి వాటికితిరిగి ఇవ్వాలి. వాటితో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకు ప్రభుత్వంపై ఆధారపడ్డ మునిసిపాలిటీలకు ఇప్పుడు హక్కుగా సంక్రమించనుంది.
ఇక, మరో కీలక ప్రతిపాదనకు కూడా సభ ఆమోద తెలిపింది. ఈ మునిసిపల్ చట్ట సవరణ మేరకు.. కొత్తగా మునిసిపాలిటీలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలుగనుంది. ఇప్పటి వరకు కొత్త మునిసిపాలిటీ ఏర్పాటు చేయాలంటే.. ఎప్పటికప్పుడు అసెంబ్లీలో చర్చించాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ సవరణ చట్టంలోనే దీనిని చేర్చారు. తద్వారా.. అసెంబ్లీలో చర్చకు పెట్టకుండానే కొత్త మునిసిపాలిటీని ఏర్పాటు చేసుకునే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుంది. కాగా.. ఈ చట్ట సవరణ బిల్లును గవర్నర్ ఆమోదించాల్సి ఉంది.