కిషన్ రెడ్డితోనే మెట్రోరుణం ఆగిందా? సీఎం రేవంత్ వాదనలో లాజిక్ ఎంత?

గడిచిన కొద్దిరోజులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న ఆరోపణల గురించి తెలిసిందే.

Update: 2026-06-16 09:30 GMT

గడిచిన కొద్దిరోజులుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న ఆరోపణల గురించి తెలిసిందే. ఆయపై వరుస పెట్టి విమర్శలు.. తీవ్ర ఆరోపణలు మాత్రమే కాదు.. ఆయన కారణంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఆగిపోతున్నట్లుగా చెప్పటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే సోమవారం (జులై 15న) నిర్వహించిన మీడియా సమావేశంలో మెట్రో నిధుల రాష్ట్ర ఖాతాలో జమ కాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుకున్నారని చెప్పటమే కాదు.. మొత్తం ప్రెస్ మీట్ ను కిషన్ రెడ్డి.. మెట్రో చుట్టూనే సాగటం గమనార్హం.

హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కిషన్ రెడ్డి ఆపేశారని.. జపాన్ నుంచి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఖాతాలో జమ అయిన రూ.13,600 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేసినట్లుగా సీఎం రేవంత్ వాదనలు వినిపిస్తున్నారు. కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని.. వారిద్దరు కుట్ర పూరితంగా తెలంగాణ డెవలప్ మెంట్ ను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇంతకూ సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశాల్లో లాజిక్ కు దగ్గరగా ఉందా? కాసేపు రాజకీయాల్ని పక్కన పెట్టి.. సాంకేతిక అంశాల్ని ప్రాతిపదికగా తీసుకున్నప్పుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీద చేసిన విమర్శలు.. ఆరోపణల్లో నిజం ఉండే వీలుందా?

ఒక కేంద్రమంత్రి అనుకుంటే.. రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని అడ్డుకునే అవకాశం ఉందా? ఇతర సాంకేతిక అంశాల మాటేంటి? సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశాలన్ని సాంకేతికంగా కరెక్టేనా? తెలంగాణకు రావాల్సిన నిధుల్ని అడ్డుకోవటం ద్వారా కిషన్ రెడ్డి భారీ జూదాన్ని ఆడారా? సొంత రాష్ట్రానికి నిధులు రాకుండా..ప్రాజెక్టులు ముందుకు వెళ్లకుండా దుర్మార్గమైన తీరును ప్రదర్శిస్తున్నారా? సీఎం రేవంత్ చేస్తున్న ఆరోపణల్ని టెక్నికల్ గా చూసినప్పుడు నిజమెంత? అన్న వివరాల్లోకి వెళితే.. పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. ఇందులో సీఎం రేవంత్ లేవనెత్తిన అంశాల్లో నూటికి 80 శాతం వరకు దగ్గరగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అదెలా? అన్నది చూస్తే..

టెక్నికల్ పాయింట్ 1

హైదరాబాద్ మెట్రో కోసం తెలంగాణ రాష్ట్రం రూ.13,600 కోట్ల డెట్ రీఫైనాన్సింగ్ ఒప్పందాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్ సీ) తో చేసుకుంది. ఐఆర్ఎఫ్ సీ అన్నది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే ఒక ప్రభుత్వ రంగ సంస్థ. కిషన్ రెడ్డి కేంద్ర సీనియర్ మంత్రి కావటం.. తెలంగాణకు చెందిన ఏకైక క్యాబినెట్ మంత్రి కావటంతో.. సదరు రాష్ట్రానికి చెందిన మెగా ప్రాజెక్టుల ఫైల్స్ పై కేంద్ర రైల్వే.. పట్టణాభివ్రద్ది శాఖ మంత్రులతో సంప్రదించే అవకాశం ఆయనకు ఎక్కువ. సాంకేతికంగా కేంద్ర మంత్రి శాఖ ఓకే చేయకుండా ఐఆర్ఎఫ్ సీ నిధులు విడుదల చేసే వీల్లేదు.

టెక్నికల్ పాయింట్ 2

మెట్రో మొదటి దశను ఎల్ అండ్ టీతో కలిసి పబ్లిక్ ప్రైవేటు పార్టనర్ షిప్ మోడల్ లో నడిపించటం.. మెట్రో రైలు విస్తరణ నేపథ్యంలో మొత్తం ఒకే యాజమాన్యంలో ఉండాలన్న నేపథ్యంలో రేవంత్ ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి వాటాలను ప్రభుత్వం కొనేసి.. మొత్తం మెట్రోను స్వాధీనం చేసుకోవాలనుకోవటం తెలిసిందే. ఇలా పీపీపీ పద్దతి నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోకి ప్రాజెక్టు మారినప్పుడు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు అవసరం. లేదంటే.. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరి. టెక్నికల్ గా ఈ నిబంధనల ప్రక్రియ పూర్తి కాకుండా నిధులు రావు. కేంద్రం టెక్నికల్ కొర్రీలు పెడుతుంటే.. లోన్ డిస్బర్స్ మెంట్ ఆటోమేటిక్ గా ఆగుతుంది.

టెక్నికల్ పాయింట్ 3

రూ.13,600 కోట్ల భారీ రుణాన్ని జపాన్ నుంచి 4 శాతం అతి తక్కువ వడ్డీకి తీసుకున్నారు. అయితే.. ఇక్కడ జపాన్ నుంచి వచ్చే నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి రాకుండా.. మధ్యలో ఐఎఫ్ఆర్ సీ వద్దకు వచ్చి.. అక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. అంటే.. ఐఎఫ్ఆర్ సీ మధ్యవర్తి పాత్ర పోషించాలి. అంతర్జాతీయ సంస్థల నుంచి వచ్చే ఏ విదేశీ రుణమైనా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోవరెన్ గ్యారెంటీ (సార్వభౌమ గ్యారెంటీ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి వేళ.. కేంద్ర మంత్రులు కానీ స్థానిక ఎంపీలు కానీ ప్రాజెక్టు డీపీఆర్ మీద కానీ ప్రాజెక్టు వ్యయాల సాంకేతిక లోపాలను లేవనెత్తితే.. కేంద్ర ఆర్థిక.. రైల్వే శాఖలు ఆ ఫైల్ ను హోల్డ్ లో పెట్టే వీలుంది. ఇప్పుడు జరిగింది ఇదే అన్నది సీఎం రేవంత్ మాట.

టెక్నికల్ పాయింట్ 4

ఈ రుణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1400 కోట్ల మార్జిన్ మనీ.. రూ.84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించి.. ఆర్ బీఐ అనుమతిపత్రాలు సమర్పించినా.. నిధులు రాలేదని సీఎం రేవంత్ చెబుతున్నారు. ముఖ్యమంత్రి చెప్పినట్లు ఇలా జరిగిందంటే దీనికి రాజకీయ కారణంతో పాటు.. సాంకేతికంగా ఎఫ్ఆర్ బీఎం పరిమితులు.. గ్యారెంటీ నిబంధనలపై కేంద్ర ఆర్థిక శాఖ రివ్యూ చేస్తుండొచ్చు. అలా చేసే ప్రక్రియను సా...గదీసే వీలుంది. ఇందులో కేంద్ర మంత్రుల మాట ప్రాధాన్యతగా మారుతుంది. మొత్తంగా చూస్తే.. ఒక కేంద్రమంత్రి కూర్చొని రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఆపలేరు. అదే సమయంలో సాంకేతిక అంశాల బూచిని పాలనా వ్యవస్థల్లోని కొందరు కీలక స్థానాల్లో ఉన్న వారి చేత కొర్రీలు వేయించటం ద్వారా ఆలస్యం చేసే వీలుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News