సుప్రీంకోర్టులో పిటిష‌న్‌: తెలంగాణ స్థానికం ఆగుతుందా?

అయితే.. రిజ‌ర్వేష‌న్ అంశం మాత్రం ఎటూ తేల‌లేదు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో హైకోర్టులో పెండింగులో ఉంది.;

Update: 2025-10-05 02:45 GMT

తెలంగాణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ తేనెతుట్టెను త‌ల‌పిస్తోంది. ఒక‌రు కావాలంటారు.. మ‌రొక‌రు వ‌ద్దంటారు.. ఈ ప‌రిణామాలు ఇటురాజ‌కీయ నేత‌లను, అటు ప్ర‌జ‌ల‌ను కూడా గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో హైకోర్టులో దాఖ‌ల‌పై ప‌లు పిటిష‌న్ల‌లో త‌క్ష‌ణ‌మే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేలా ఆదేశించాల‌ని కోరుతూ.. ప‌లువురు పంచాయ‌తీ ప్రెసిడెంట్లు, స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధులు వాద‌న‌లు వినిపించారు. దీనిపై సుదీర్ఘ విచార‌ణ అనంత‌రం.. హైకోర్టు సెప్టెంబ‌రు 30 లోగా నిర్ణ‌యం తీసుకుని ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సిందేన‌ని తేల్చి చెప్పింది.

అయితే.. రాష్ట్ర ప్ర‌భుత్వం మాత్రం.. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చే వ‌ర‌కు దీనిని వాయిదా వేయాల‌ని కోరింది. కానీ, హైకోర్టు ఈ వాద‌న‌ను ప‌క్క‌న పెట్టి ముందు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చెప్ప‌డంతో ప్ర‌భుత్వం కూడా మాన‌సికంగా రెడీ అయింది. ఆ వెంట‌నే రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు ఇప్ప‌టికే నోటిఫికేష‌న్‌, షెడ్యూల్ రెండూ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన నామినేష‌న్ ప్ర‌క్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తంగా 5 ద‌శ‌ల్లో ఈ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను మూడు ద‌శ‌ల్లోనూ.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల‌కు రెండు ద‌శ‌ల్లోనూ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ పూర్తి చేయాల‌ని నిర్దేశించారు. న‌వంబ‌రు 11 నాటికి మొత్తం ప్ర‌క్రియ పూర్తి కానుంది.

అయితే.. రిజ‌ర్వేష‌న్ అంశం మాత్రం ఎటూ తేల‌లేదు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన జీవో హైకోర్టులో పెండింగులో ఉంది. ఇదిలావుంటే.. అస‌లు ఎన్నిక‌లు జ‌ర‌ప‌కుండా ఆదేశాలు జారీ చేయాల‌ని కోరుతూ.. వంగ గోపాల్ రెడ్డి అనే వ్య‌క్తి సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. హైకోర్టు తీర్పులోప‌భూయిష్టంగా ఉంద‌ని.. దీనిని కొట్టి వేయాల‌ని కోరారు. స్థానిక సంస్థ‌ల రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌హారం తేల్చ‌కుండానే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింద‌ని.. ఇంత హ‌డావుడిగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకున్న వారికి ఆశాభంగం క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టి వేసి.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి రిలీఫ్ క‌ల్పించాల‌ని పిటిష‌న్‌లో కోరారు.

ఈ పిటిష‌న్‌ను గ‌త నెల 29న దాఖ‌లు చేయ‌గా.. శ‌నివారం మ‌ధ్యాహ్నం దీనిని ప‌రిశీలించిన సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రుపుతామ‌ని.. దీనికిగాను 6వ తేదీని నిర్ణ‌యిస్తామ‌ని పేర్కొంది. అంటే.. పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. అయితే.. ఇది విచార‌ణ‌కు వ‌చ్చే 6వ తేదీ త‌ర్వాత‌..రెండు రోజుల్లోనే నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. పంచాయ‌తీల్లో ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితాల‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటు ఎన్నిక ల‌సంఘం ఆపేందుకు వీల్లేద‌ని, ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసుకున్నామ‌ని చెప్పే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వం ఎలాంటి వాద‌న వినిపిస్తుందో చూడాలి. ఏదేమైనా.. తెలంగాణ స్థానిక ఎన్నిక‌ల వ్య‌వ‌హారం.. సుప్రీంకోర్టు కు చేరింది.

Tags:    

Similar News