తెలంగాణ పోరు: ఓట‌ర్ల జాబితా రెడీ.. నోటిఫికేష‌నే త‌రువాయి!

సుమారు ల‌క్షా 18 వేల మందికి పైగా మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నార‌ని ఎన్నిక‌ల సంఘం తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌ను బ‌ట్టి తెలుస్తోంది.;

Update: 2026-01-13 23:30 GMT

తెలంగాణ‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. ఈ నెల 20న నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. మొత్తంగా 117 మునిసిపాలిటీల‌కు ప్ర‌త్య‌క్ష ప‌ద్ద‌తిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల అధికారులు ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేశారు. దీని ప్ర‌కారం.. ఆయా మునిసిపాలిటీల ప‌రిధిలో ఎంత మంది ఓట‌ర్లు ఉన్నారు? ఎంత‌మందిని కొత్త‌గా చేర్చారు? అనే వివ‌రాల‌ను పొందు ప‌రిచారు. దీని ప్ర‌కారం.. త్వ‌ర‌లోనే ఎన్నిక‌ల‌కు రెడీ అవుతున్న సంకేతాలు ఇచ్చిన‌ట్టు అయింది.

ఎక్క‌డెక్క‌డ ఎలా ఎలా?

+ మొత్తం ఓట‌ర్లు: 52,43,023

+ పురుషులు: 25,62,369

+ మ‌హిళ‌లు: 26,80,014

+ ట్రాన్స్ జెండ‌ర్లు: 640

చిత్రం ఏంటంటే.. పురుష‌ల కంటే కూడా రాష్ట్రంలో మ‌హిళ‌ల ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. సుమారు ల‌క్షా 18 వేల మందికి పైగా మ‌హిళా ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్నార‌ని ఎన్నిక‌ల సంఘం తాజాగా విడుద‌ల చేసిన నివేదిక‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఇక‌, కార్పొరేష‌న్ల వారీగా చూస్తే.. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని కొత్త‌గూడెం కార్పొరేష‌న్‌లో కేవ‌లం ల‌క్షా 34 వేల మంది ఓట‌ర్లు ఉండ‌గా.. నిజ‌మాబా ద్ కార్పొరేష‌న్‌లో భారీ సంఖ్య‌లో 3.48 ల‌క్ష‌ల మంది ఓట‌ర్లు ఉన్నార‌ని ఎన్నిక‌ల ఓట‌ర్ల జాబితా వెల్ల‌డించింది. ఇక‌, ఎస్టీలు ఎక్కువ‌గా ఉన్న ఆదిలాబాద్ మునిసిపాలిటీలో ల‌క్షా 43 వేల మంది ఓటర్లు ఉన్నారు.

భారీ క్ర‌తువు..

రాష్ట్రంలో మునిసిప‌ల్ , కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ను భారీ క్ర‌తువుగా ఎన్నిక‌ల సంఘం పేర్కొంది. ఇంకా రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు కావాల్సి ఉంద‌ని తెలిపింది. ప్ర‌భుత్వం రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేసిన ద‌రిమిలా.. త‌దుప‌రి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్టు వివ‌రించింది. మ‌రో వైపు జ‌నాభా ఆధారంగా .. వార్డులు, డివిజ‌న్ల‌ను ఖ‌రారు చేస్తారు. మొత్తంగా ఆరు కార్పొరేష‌న్లు, 117 మునిసిపాలిటీల‌కు త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్ ఇచ్చే దిశ‌గా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. తాజా అంచ‌నాల ప్ర‌కారం.. ఈ నెల 20న నోటిఫికేష‌న్ రానుంది.

Tags:    

Similar News