ఇంత పెద్ద వ్యవస్థ ఉండగా.. ఇదేంటి సీఎం గారూ!
తెలంగాణ పోలీసులు.. ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. చీమ చిటు క్కుమన్నా పట్టేసే వ్యవస్థలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ పోలీసులకు.. కేసుల పరిశోధన నల్లేరుపై నడకవంటిదే. అలాంటిది.. బండి భగీరథ్ కేసు విషయంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారం.. ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. మెజారిటీ ప్రజలు.. ప్రభుత్వం తీరుపై పెదవి విరుస్తున్నారు.
మరీ ముఖ్యంగా పోక్సో కేసులో నిందితుడిగా పేర్కొన్న వ్యక్తి విషయంలో ప్రభుత్వం తాత్సారం చేయడం అంటే.. రేపు కోర్టుల నుంచి ప్రశ్నలు కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. గతంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే ప్రశ్న ఎదురైంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కి ఆఫర్ ఇవ్వడం పై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతుండడం గమనార్హం.
బండి భగీరథ్‌ను తీసుకువచ్చి అప్పగించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులను తీసుకువచ్చి అప్పగించమని.. సామాన్యులను కూడా ఇలానే సీఎం అభ్యర్థిస్తారా? అనే ప్రశ్నలు నెటిజన్ల నుంచి సూటిగా తగులుతున్నాయి. ఇంత పెద్ద పోలీసు వ్యవస్థ... ఇంటెలిజెన్స్ వ్యవస్థ.. కేంద్ర నిఘా సంస్థలు.. అన్నింటికీ మించి.. సోషల్ మీడియా.. ప్రభుత్వ వర్గాలు ఇన్ని ఉన్నా.. భగీరథ్‌ను వరుసగా వారం రోజులు అయినా గుర్తించ లేక పోవడంపై విమర్శలు వస్తున్నాయి.
దారి తప్పిన ఖాకీ..
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోనే ఉన్న హోంశాఖ దారి తప్పిందన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులపై జిల్లాల్లో అనేక ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. స్టేషన్‌కు బాధలు చెప్పుకొనేందుకు వచ్చే వారినే వేధించడం.. మహిళా బాదితులతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం.. మహిళా కానిస్టేబుల్ కు అబార్షన్ చేయించిన ఘటన.. వంటివి తాజాగా ఈ వారంలో పోలీసు వ్యవస్థపై మరకలు పడేలా చేశాయి. ఇక బండి భగీరథ్ కేసు విషయం డీజీపీ ఆనంద్ ఇచ్చిన సమాధానం కూడా అనేక విమర్శలకు దారితీసింది.