కేసీఆర్ ఫామ్ హౌజ్.. తెలంగాణ పబ్లిక్ స్కూల్.. రేవంత్ భలే ప్లాన్
మొదట కేసీఆర్ ఫాంహౌస్ జగదేవపూర్ మండల పరిధిలో ఉండేది. తెలంగాణ జిల్లాల పునర్విభజన సమయంలో మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు.;
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. అత్యంత కీలకమైన బడ్జెట్ సమర్పణ వేళ.. ముఖ్య విషయం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ కు పరిమితం కాకుండా, అసెంబ్లీకి రావాల్సిందిగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను పదేపదే కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలో చేయబోయే ప్రారంభోత్సవం ఆశ్చర్యపరుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైన అంశం కేసీఆర్ ఫామ్ హౌజ్. ఇప్పుడు దీని దగ్గరే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక పబ్లిక్ స్కూల్ ను ఏర్పాటు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల (టీపీఎస్ )లను ప్రారంభించనున్నారు. వీటిలో ముఖ్యమైనది సిద్దిపేట జిల్లా మర్కూక్ లో నిర్మించబోయేదే. అదేమంటే.. ఈ స్కూల్ ను కట్టేది కూడా కేసీఆర్ ఫామ్ హౌజ్ కు అత్యంత సమీపంలో కావడమే. కేసీఆర్ 2010-11 నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌజ్ లోనే ఎక్కువ ఉంటున్నారు. అక్కడినుంచే 2014 ముందు వరకు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి సీఎం అయిన తర్వా కూడా ఫాంహౌజ్ విషయమై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. ఇక 2023 చివరలో అధికారంలో కోల్పోయాక కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి నేరుగా ఫాంహౌజ్ కు వెళ్లిపోయారు. ఈ రెండేళ్లకుపైగా సమయంలో 90 శాతం ఆయన అక్కడే గడిపారు.
22న సీఎం రేవంత్ వెళ్తారా?
మర్కూక్ లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి ఈ నెల 22న అంటే ఆదివారం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రోజు సిద్దిపేట జిల్లా నంగునూరులో పామాయిల్ పరిశ్రమను ప్రారంభించనున్నారు. అయితే, టీపీఎస్ కు రేవంత్ వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినందున టీపీఎస్ ల విషయంలో అంతే స్థాయిలో నిర్మాణాలు ఉంటాయని భావించవచ్చు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి వంద టీపీఎస్ లను ఏర్పాటు చేయాలని రేవంత్ ఆదేశించారు. అంటే, ఏడాదిన్నరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
అతి సమీపంలోనే..
మొదట కేసీఆర్ ఫాంహౌస్ జగదేవపూర్ మండల పరిధిలో ఉండేది. తెలంగాణ జిల్లాల పునర్విభజన సమయంలో మండలాలను కొత్తగా ఏర్పాటు చేశారు. అలా కేసీఆర్ ఫాంహౌజ్ ఉన్న ఎర్రవల్లి మర్కూక్ మండల పరిధిలోకి వచ్చింది. కేసీఆర్ 2014లో తెలంగాణ సీఎం అయ్యాక 300 మంది పోలీస్ సిబ్బంది కోసం ఫాంహౌస్ పక్కనే క్వార్టర్స్ కట్టారు. విశేషం ఏమంటే వీటి పక్కనే ఐదు ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇందులోనే రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను ఏర్పాటు చేయనుంది. ఒక విధంగా చూస్తే, కేసీఆర్ ఎంతో ఇష్టపడే ఫామ్ హౌజ్ సమీపంలో నెలకొల్పే టీపీఎస్ కారణంగా ఆయన ప్రైవసీకి కొంత ఇబ్బందే. ఒకసారి స్కూల్ ఏర్పాటయ్యాక రాకపోకలు విపరీతంగా పెరుగుతాయి. దీంతోపాటు కేసీఆర్ ఫాంహౌజ్ ఇదిగో.. అంటూ ఆగి చూసేవారు కూడా ఉంటారు. పైగా టీపీఎస్ లు ప్రభుత్వం విద్యార్థులకు అత్యంత ఉన్నత ప్రమాణాల విద్య కోసం ఏర్పాటు చేస్తున్నాయి. దీనిని వ్యతిరేకిస్తే విమర్శలు వస్తాయి. మరి ఏం జరగనుందో చూడాలి.