తెలంగాణలో కులాల గుట్టు విప్పిన సర్కారు రిపోర్టు

అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ కులాలకు సంబంధించిన అధికారిక వివరాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది.;

Update: 2026-04-16 05:36 GMT

అన్ని వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ కులాలకు సంబంధించిన అధికారిక వివరాలను తాజాగా ప్రభుత్వం విడుదల చేసింది. గత ఏడాది ఓసీ.. బీసీ.. ఎస్సీ.. ఎస్టీల జనాభా లెక్కలను మాత్రమే విడుదల చేయగా.. తాజాగా మాత్రం రాష్ట్రంలోని ప్రతి కులం వారీగా జనాభా ఎంత ఉందన్న విషయాన్ని స్పష్టం చేసే సమాచారంతో పాటు.. పలు ఆసక్తికర సామాజిక అంశాల్ని కూడా వెల్లడించింది. కులగణనలో భాగంగా రాష్ట్రంలో ప్రతి కులం..వారి జనాభా ఎంతన్న వివరాల్నిస్పష్టంగా వెల్లడించింది.కులగణనలో సేకరించిన ఆర్థిక.. సామాజిక..విద్య.. రాజకీయరంగాల్లో ఏ కులం ఏ స్థానంలో ఉందో స్పష్టం చేసే గణాంకాల్ని వెల్లడించటం ద్వారా.. తెలంగాణలో కులాల సామాజిక స్వరూపాన్ని చెప్పేసిందని చెప్పాలి.



 


మొత్తంగా చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా బీసీలు 56.33 శాతంగా పేర్కొన్నారు. ఇందులో 10.08 శాతం వెనకబడిన ముస్లింలు ఉన్నారు. ఎస్సీలు 17.43 శాతం కాగా, ఎస్టీలు 10.45 శాతం. ఓసీలు 15.79శాతంగా పేర్కొంది. ఓసీల్లో జనాభా పరంగా రెడ్లు అగ్రస్థానంలో ఉన్నారు. ఓసీల్లో వీరు 30.47 శాతం ఉండగా.. తర్వాతి స్థానంలో ఓసీ ముస్లింలు 11.08 శాతం.. వైశ్యులు 9.07 శాతం.. కమ్మవారు 6.56 శాతం.. బ్రాహ్మణులు 5.98 శాతం ఉన్నారు. వెలమలు 2.56 శాతం ఉండగా.. కులం పేరు వెల్లడించని వారు ఓసీల్లో 21.49 శాతం ఉండటం విశేషం. ఈ కోవకు చెందిన వారు 12 లక్షలకు పైనే ఉన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

విద్య,, ఉద్యోగాలు, భూములు, ఇళ్లు, కార్లు ఇలాంటి వాటిల్లో అగ్రకులాల వారే ముందున్నారు. వీరిలో భూములు అత్యధికంగా రెడ్ల చేతిలో ఉంటే.. ఆ తర్వాతి స్థానంలో వరుసగా యాదవ, లంబడా, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపులు అత్యధిక భూములు కలిగి ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రాష్ట్రంలోని 56 ప్రధానకులాల మధ్య భారీ అసమానతలు ఉన్నట్లుగా తేలింది. బీసీల్లో కొన్ని వర్గాలు అయితే సామాజికంగా..ఆర్థికంగా ఓసీ వర్గాలతో సమానంగా ఉన్నట్లుగా వెల్లడించింది.

మరో అంశం ఏమంటే.. రాష్ట్ర వెనుకుబాటుతనం సగటుతో పోలిస్తే ఎస్సీ క్రైస్తవులు.. కంసాలీలు మెరుగైన స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వారు అన్ని కులాల్లోనూ పెరుగుతున్నారు. ఇక.. విద్య విషయంలో అందరికంటే ఎక్కువగా జైనుల్లోనే విద్యాపరంగా అత్యంత వెనుకుబాటుతనంతో ఉన్నారు. బీసీల్లో వడ్డెరలు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన వర్గంగా చివరి స్థానంలో ఉన్నారు.

ఓసీలైన రెడ్లు.. విద్యాసాధనలో దళిత క్రైస్తవులు.. కంసాలి వంటి కొన్ని వెనుకబడిన వర్గాలతో సమానంగా ఉన్నట్లు వెల్లడైంది. ఓసీ ముస్లింలు విద్యాపరంగా వెనుకబాటుతనంతో ఉన్నారు. వీరు అనేక బీసీ గ్రూపుల కంటే కిందన ఉన్నారు. తెలంగాణలో డిప్లొమా.. అంతకంటే ఎక్కువ చదివిన వారి సగటు 36.3 శాతంగా ఉంటే.. ఉన్నత విద్యాసాధనంలో అగ్రస్థానంలో ఉన్న కులానికి.. అట్టడుగున ఉన్న కులానికి మధ్య వ్యత్యాసం చాలా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఓసీలైన ఆర్యవైశ్యులు.. వెలమలు..బ్రాహ్మణుల్లో అత్యధికంగా 37 శాతం మంది డిప్లొమా.. అంతకంటే ఎక్కువగా చదివినట్లుగా గుర్తించారు.

తెలంగాణలోని 56 ప్రధాన కులాల్లో ప్రతి కులంనుంచి 30 ఏళ్ల లోపు ఉన్న వారిలో సగటున 47 శాతం మంది ఇంగ్లిషఉలో చదువుకున్నారు. ఓసీల్లో బ్రాహ్మణులు.. ఆర్యవైశ్యుల్లో ఇది 72 శాతం ఉండగా.. ఎస్టీలైన కొలాంలలో కేవలం 11 శాతమే ఉంది. బ్రాహ్మణుల్లో 38 శాతంకంటే ఎక్కువ మంది పిల్లలు ప్రైవేటు స్కూళ్లకు వెళుతుంటే.. ఎస్సీ కొలాంలలో కేవలం ఒక శాతం మందికే ఈ అవకాశం అందుబాటులో ఉంది. అత్యధికంగా 16.4 శాతం బ్రాహ్మణుల ఇళ్లలో సొంత కార్లు ఉన్నాయి. ఓసీల వద్ద ఓబీసీల వద్ద కంటే మూడు రెట్లు.. ఎస్సీలు.. ఎస్టీల కంటే ఐదు రెట్లు అధికంగా కార్లు ఉన్నాయి. రాష్ట్రంలో సగటున 3.2 శాతంకుటుంబాలకు కార్లు ఉన్నాయి. అత్యధికంగా బ్రాహ్మణ కుటుంబాలకు కార్లు ఉండగా.. తర్వాత రాజులు.. కమ్మ.. కాపు..వైశ్యులు.. వెలమ..జైన్ల కుటుంబాల వారి వద్ద ఉన్నాయి. క్రిస్టియన్లు.. కంసాలి కుటుంబాల్లో కూడా సగటు.. అంతకంటే ఎక్కువగా కార్లు ఉన్నట్లుగా తేలింది.

కులాంతర వివాహాల విషయానికి వస్తే అయ్యంగార్లు.. అయ్యర్లు వర్గంలో 12 శాతం కుటుంబాల్లో కులాంతర వివాహాలు జరిగాయి. ఎస్సీ క్రిస్టియన్లలో 9.9 శాతం. రాజులు 8.7 శాతం.. గంగిరెద్దులవారు, అగ్నికుల క్షత్రియులు.. ఓసీ కాపులు, బ్రాహ్మణుల వంటి వారి వర్గాల్లో కూడా ఈ ధోరణి కొంత పెరుగుతోంది. పట్టణాల్లో నివసించే వర్గాల్లో కుల పరిమితులు తగ్గుతున్నాయి. కొలాం, మాలి, గోండ్లు వంటి వర్గాల్లో కులాంతర వివాహాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా బలమైన ఓసీ వెలమలు (5.1 శాతం), రెడ్లు (4.4శాతం) లలో కూడా తక్కువ కులాంతర వివాహాలు జరగటం గమనార్హం.

Tags:    

Similar News