''మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకుంటే.. సీఎం సీటు నుంచి దించేస్తం''
తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి మద్దతుగా బహిరంగ లేఖ ఒకటి బయటకు వచ్చింది.;
తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఊసు ఆగిపోయింది. అదిగో ఇదిగో అంటూ.. కొన్నాళ్లు ఊరించినా.. ఎక్కువ మంది పోటీలో ఉండడం.. ఎవరిని ఎంపిక చేసినా.. మరొకరు వివాదానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితిలో మంత్రి విస్తరణ చేయడం కన్నా.. వాయిదా వేయడమే బెటర్ అన్న ట్టుగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి వాయిదా వేసింది. అయినప్పటికీ.. మంత్రి వర్గంలో చోటు కోసం జరుగుతు న్న వాదాలు.. వివాదాలు ఎక్కడా ఆగడం లేదు.
తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకాటి శ్రీహరికి మద్దతుగా బహిరంగ లేఖ ఒకటి బయటకు వచ్చింది. గుట్టలు గుట్టలుగా తయారు చేసిన ఈ లేఖలు.. అన్ని ప్రాంతాల్లోన దర్శనమి స్తున్నాయి. వాకాటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అయితే.. ఆయనకు మంత్రి వర్గంలో సీటు ఖాయమని కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. కానీ.. వాకాటికి మంత్రి వర్గంలో చోటు దక్కకుం డా కొందరు రెడ్డి నాయకులు అడ్డు పడుతున్నారని.. ఆరోపిస్తూ.. ముదిరాజ్‌సామాజిక వర్గానికి చెందిన వారు ఈ బహిరంగ లేఖలను ప్రచారంలోకి తెచ్చారు.
లేఖలో సారాంశం ఇదీ..
``మా నాయకుడు శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుపడుతున్న రెడ్డి సామాజిక వర్గానికి హెచ్చరిక. మీరు అడ్డుపడి మా నాయకుడికి మంత్రి పదవిఇవ్వకపోతే.. మీ సీఎం సీటును తీసేయడానికి.. మిమ్మల్ని.. సీఎం సీటు నుంచి దింపేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం`` అని లేఖలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గతంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వొద్దని.. అనేక అక్రమాలకు పాల్పడుతున్నారంటూ కొందరు ఆయనకు వ్యతిరేకంగా సిరీస్ లేఖలు విడుదల చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అలాంటి తప్పుడు ప్రచారం చేస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.