గవర్నర్ తో రేవంత్ భేటీ : ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ?
తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ మీద జోరుగా చర్చలు సాగుతున్న సంగతి విధితమే. తెలంగాణా క్యాబినెట్ లో ఆరు ఖాళీలు ఉన్న సంగతి తెలిసిందే.;
తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ మీద జోరుగా చర్చలు సాగుతున్న సంగతి విధితమే. తెలంగాణా క్యాబినెట్ లో ఆరు ఖాళీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఖాళీల భర్తీ కోసం గత పదిహేను నెలలుగా తెలంగాణా కాంగ్రెస్ నాయకత్వం జాతీయ అధినాయకత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు జాతీయ నాయకత్వం మంత్రివర్గ విస్తరణకు పచ్చ జెండా ఊపింది అన్న వర్తలు వచ్చాయి. ఇటీవలనే ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి ఉప ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వంటి వారు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారు. అన్నీ ఫలప్రదంగా ముగిసాయని ప్రచారం సాగింది.
ఒక కేబినెట్ బెర్త్ ని ఖాళీగా ఉంచి అయిదు మంత్రి పదవులు భర్తీ చేస్తారని ఊహాగానాలు వ్యాపించాయి. అలా కాదు మొత్తం ఆరు ఖాళీలూ భర్తీ చేస్తారు అని మరో ప్రచారానికి తెర లేచింది ఇక పాత వారిలో పనిమంతులు కానీ కొంతమందిని ఉద్వాసన పలికి ఆ స్థానంలోకి కొత్త వారికి చాన్స్ ఇస్తారని కూడా వార్తలు వచ్చాయి. అలా చూసుకుంటే కనీసంగా ఎనిమిది మంది దాకా కొత్త ముఖాలు మంత్రివర్గంలోకి ప్రవేశిస్తారు అని కూడా అనుకున్నారు.
ఇక ఉగాదికే మంత్రి వర్గ విస్తరణ అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగినా ఆ రోజు వచ్చేసింది కానీ జరగలేదు. అయితే ఉగాది వేళ ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం రేవంత్ సమావేశం కావడమే ఆ విశేషం. దీంతో రాజకీయంగా కలకలం రేగింది.
మంత్రివర్గ విస్తరణ ఊహాగానాల నేపథ్యంలో ఈ విధంగా రేవంత్ రెడ్డి గవర్నర్‌తో సమావేశం కావడంతో ఈ అంశానికి రాజకీయంగా విపరీతంగా ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ ఎపుడు అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని అంటున్నారు
ఆ రోజున మంచి ముహూర్తం ఉందని చెబుతున్నారు. ఇక మంత్రివర్గంలోకి ఎవరికి తీసుకోవాలన్నది హైకమాండ్ వద్దనే లిస్ట్ ఫైనలైజ్ అయింది అని అంటున్నారు. తగిన సమయంలో వారికి ఫోన్లు వస్తాయని మంత్రులుగా వారు ప్రమాణం చేయడమే తరువాయి అని అంటున్నారు. అయితే మీడియాలో వచ్చిన పేర్లు కాకుండా అనూహ్యంగా కొంతమందికి మంత్రి చాన్స్ ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణకు కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది. కొత్త మంత్రులు అంతా తెర వెనక ఉన్నారు. వారు ఎవరో అన్నది తెలియడానికి అతి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అంతవరకూ వెయిట్ అండ్ సీ.