తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన 'ఆటోడ్రైవర్లు' .. రీజనేంటి?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మహిళా శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో తమ ఉపాధికి గండిపడుతుందని ఆటో డ్రైవర్లు... నిరసన వ్యక్తం చేశారు.;
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆటోడ్రైవర్ల వ్యవహారం.. పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఎక్కడికక్కడ ఆటోడ్రైవర్లను అరెస్టు చేయ డాన్ని బీఆర్ ఎస్ కీలక నాయకుడు.. ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం చేతకాని తనానికి.. ఆటోడ్రైవర్లను అరెస్టు చేస్తున్నా రని ఆయన వ్యాఖ్యానించారు. ఆటోడ్రైవర్లను అరెస్టు చేయడం అంటే.. ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. వారిని తక్షణమే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. ఇదేసమయంలో ఆటో కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు. కేటీఆర్‌తోపాటు.. పలువురు బీఆర్ ఎస్ నాయకులు కూడా ఆటోడ్రైవర్ల సమస్యలపై స్పందించారు.
ఎందుకు?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. మహిళా శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో తమ ఉపాధికి గండిపడుతుందని ఆటో డ్రైవర్లు... నిరసన వ్యక్తం చేశారు. తమకు ప్రత్యామ్నాయం చూపాలని కోరుకున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం ఏటా రూ.11 వేల చొప్పున ఆటో డ్రైవర్ల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చింది. అయితే.. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా.. ఇప్పటి వరకు ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టలేదు. తొలుత అనేక నిబంధనలు అయితే విడుదల చేశారు. ఆటో డ్రైవర్ల సంఖ్యను కూడా తేలుస్తామన్నారు. కానీ, ఇది ముందుకు సాగలేదు.
చలో అసెంబ్లీ. ..
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో ఆటోడ్రైవర్లు.. శనివారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించి అయినా.. తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలని భావిస్తూ.. అసెంబ్లీని ముట్టడించేందుకు ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అరెస్టు అయ్యారు. ఎక్కడికక్కడ ఆటోడ్రైవర్లను అరెస్టు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లోనూ.. ఆటో డ్రైవర్లు ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నారు. అయితే.. అక్కడ కూడా పరిస్థితి ఇలానే ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో ఆటోలను బంద్ చేశారు. ఈ వ్యవహారం అసెంబ్లీని కుదిపి వేసింది.