తెలంగాణాకు 40 అసెంబ్లీ సీట్లు...ఏపీకి 60 ?
ఇక ఈసారి ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తారు అని అంటున్నారు. అవి ముప్పయి మూడు శాతం రిజర్వేషన్లుగా అమలు చేయాలి.;
వచ్చే లోక్ సభ అసెంబ్లీ ఎన్నికలు మామూలుగా ఉండవని అంటున్నారు. రాజకీయం పూర్తిగా మారబోతోంది అన్నది విశ్లేషకుల మాట. ఎందుకంటే ఈసారి కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చాలా అంశాల మీద పూర్తిగా ఫోకస్ పెడుతోంది. అందులో జనాభా గణన ఒకటి. మరొకటి ఈసారి మహిళా రిజర్వేషన్లు అమలు చేసి మరీ ఎన్నికలు నిర్వహిస్తారు. దాంతో చాలా చోట్ల రాజకీయం తలపండిన దిగ్గజ నేతలకే అర్ధం కాకుండా పోతుంది అని అంటున్నారు.
పునర్ విభజనతో :
ఈసారి లోక్ సభ స్థానాలు పునర్ వ్యవస్థీకరిస్తారు. ఎవరు ఏమనుకున్నా జనాభా ప్రాతిపదికగానే అది ఉండబోతోంది. దాంతో ఇపుడు ఉన్న లోక్ సభ స్థానాలు యూపీ బీహార్ లాంటి చోట్ల చాలా ఎక్కువగా పెరుగుతాయి. ఇక దక్షిణాదిన చూస్తే మొత్తం 139 సీట్లు ఉండగా అవి 160 దాకా అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ పెరిగే అతి తక్కువ సీట్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్ని వస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంది అంటున్నారు.
అక్కడ మూడు...ఇక్కడ అయిదూ :
అయితే జరుగుతున్న చర్చలు ప్రచారం బట్టి చూస్తే కనుక తెలంగాణాలో మరో మూడు ఎంపీ సీట్లు పెరగవచ్చు అని అంటున్నారు. ఇప్పటికి అక్కడ 17 ఉంటే అవి కాస్తా ఇరవై అవుతాయి అన్న మాట. అలగే ఏపీలో పాతిక దాకా ప్రస్తుతం ఉన్నాయి, అవి 2029 నాటికి ముప్పయి దాకా పెరగవచ్చు అని అంటున్నారు.
అసెంబ్లీ సీట్ల పెంపు :
ఇక ఉమ్మడి ఏపీని విభజించే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పునర్ విభజిస్తామని హామీ ఇచ్చారు, విభజన చట్టంలో కూడా దానిని పేర్కొన్నారు. ఆ విధంగా చూస్తే 2029 నాటికి దానికి అమలు చేసే ఎన్నికలకు వెళ్తారు అని అంటున్నారు. ఈ పునర్ విభజన ఎలా ఉండబోతోంది అంటే దాని మీద కూడా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే ప్రతీ ఎంపీ సీటులో అదనంగా రెండు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంటున్నారు అంటే ఈ లెక్కన తెలంగాణాలో కొత్తగా మరో నలభై అసెంబ్లీ సీట్లు రావచ్చు అని అంటున్నారు అలాగే ఏపీలో ముప్పయి ఎంపీ సీట్లు ఉంటే అరవై దాకా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అని చర్చ ఉంది. ఈ లెక్కన తెలంగాణాలో అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం ఉన్న 119తో పాటు నలభై కలుపుకుంటే 159 దాకా ఉండొచ్చు అని అంటున్నారు. ఏపీలో అయిఏ 235 దాకా ఉండే చాన్స్ ఉందిట.
మహిళా రిజర్వేషన్లు :
ఇక ఈసారి ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తారు అని అంటున్నారు. అవి ముప్పయి మూడు శాతం రిజర్వేషన్లుగా అమలు చేయాలి. అంటే ప్రతీ మూడు అసెంబ్లీ ఎంపీ సీట్లలో ఒక సీటు మహిళలకు అన్న మాట. అలా చూస్తే ఏపీలో 235 దాకా అసెంబ్లీ సీట్లు పెరిగినా అందులో 80 దాకా లేడీస్ సీట్లుగా మారిపోతాయని అంటున్నారు. అలాగే తెలంగాణాలో యాభై వరకూ మహిళలకు అసెంబ్లీ సీట్లు రిజర్వ్ చేయడం ఖాయమని అంటున్నారు. దీని మీద తెలంగాణా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే ఒక వైపు ఎంపీ ఎమ్మెల్యే సీట్ల పునర్ విభజన మరో వైపు మహిళా రిజర్వేషన్ల అమలుతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయం పూర్తిగా మారుతుందని అంటున్నారు.