పవన్ లోకేష్ అన్నదమ్ములుగా !
తాజాగా అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు లోకేష్ పవన్ ల మధ్య ఉన్న ఒక అవ్యాజమైన అనుబంధం మీడియా సాక్షిగా బయటపడింది.;
టీడీపీ కూటమిలో విభేదాలు వస్తాయని రావాలని విపక్షం ఆశ. అయితే అది ఎప్పటికీ జరిగేది కాదని కూటమి మిత్రులు చాటి చెబుతున్నారు. నిజానికి భారతీయ రాజకీయాల్లో ఏ రెండు పార్టీల మధ్య లేని సఖ్యత ఏపీలో టీడీపీ జనసేనల మధ్యన కొనసాగుతోంది. పవన్ తన కంటే వయసులో ఎంతో పెద్ద వారు అయిన చంద్రబాబుతో ఎంతో బాగా ఉంటారు.
అదే సమయంలో తన కంటే బాగా చిన్న వారు అయిన లోకేష్ విషయంలోనూ అంతే బాగా ఉంటున్నారు. బాబుని పవన్ ఒక రకమైన అభిమానంతో కూడిన గౌరవంతో చూస్తారు. ఇంకా చెప్పాలంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా ఆరాధనా భావంతో చూస్తారు.
అదే లోకేష్ విషయానికి వచ్చేసరికి సోదర ప్రేమను కనబరుస్తున్నారు. పవన్ అన్నా అని లోకేష్ అంటూంటే అంతే ఆప్యాయతను పవన్ చూపిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్యన ఏదో ఉందని అంతా అనుకుంటారు. అలాగే గాసిప్స్ ని పుట్టిస్తారు. టీడీపీలో లోకేష్ ఎదిగితే అది జనసేనకు నచ్చదని పుకార్లుగా షికారు చేయిస్తూ వార్తలు వండుతున్నారు.
అలాగే జనసేనకు ప్రయారిటీ ఇస్తున్న విషయంలో లోకేష్ టీం అసహనంగా ఉందని వార్తలు బాగానే అల్లుతున్నారు కానీ తీరా చూస్తే అవన్నీ తుస్సుమంటున్నాయి. ఏ బహిరంగ సభలో కనిపించినా ఇద్దరూ ఆప్యాయంగా హత్తుకుంటారు. ఒకరిని మరొకరు ఎంతో ప్రేమగా పలకరించుకుంటారు.
తాజాగా అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి ముందు లోకేష్ పవన్ ల మధ్య ఉన్న ఒక అవ్యాజమైన అనుబంధం మీడియా సాక్షిగా బయటపడింది. లోకేష్ తన యువగళం పాదయాత్రని మొత్తం ఒక అందమైన పుస్తక రూపంలో తీసుకుని వచ్చారు. దానిని ఢిల్లీలో ప్రధాని మోడీకి ఆయన అందించారు.
అలాగే కడపలో జరిగినా మహానాడు వేదిక మీద తన తండ్రి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ పుస్తకం అందించి ఆయన కాళ్ళకు నమస్కరించి లోకేష్ ఆశీస్సులు తీసుకున్నారు ఇక ఇపుడు ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కి ఆ పుస్తకాన్ని ఇచ్చి మరీ ఆయన నుంచి సైతం అభిననందనలు అందుకున్నారు.
ఈ పుస్తకాన్ని ఫోటో ఆల్బం ని చూసిన పవన్ కళ్యాణ్ లోకేష్ ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయనను అభినందించారు. నాటి వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన మీద పోరాడి పాదయాత్ర ద్వారా జనంలో చైతన్యం తీసుకుని వచ్చారని పవన్ లోకేష్ కి కితాబు ఇచ్చారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు లోకేష్ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది అని పవన్ అన్నారు. మొత్తానికి పవన్ లోకేష్ ని మెచ్చుకున్న తీరు చూసిన వారు దానిని లోకేష్ ప్రతిస్పందించిన వైనాన్ని గమనించిన వారు అంతా ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా ఉన్నారని అంటున్నారు.
కూటమి మంత్రులు అంతా ఈ ఇద్దరి ఐక్యతను చూసి ముచ్చట పడ్డారు. ఏపీలో జనసేన టీడీపీ ఇంతలా కలసి మెలసి ఉండడమే ప్రభుత్వానికీ కూటమికీ శ్రీరామరక్ష అని అంటున్నారు. అధికార ఆధిపత్యాలు ఇగోలు ఏవీ పెట్టుకోకుండా అంతా ఒక్కటిగా ముందుకు సాగుతూ ఫస్ట్ ఏపీ స్టేట్ అన్న నినాదంతో కూటమి పార్టీలు పనిచేస్తున్నాయని ఆ స్పూర్తి వారిని కలిపి ఉంచుతోందని అంటున్నారు. ఏది ఏమైనా కూటమి పార్టీల పొత్తులు నాయకుల మధ్య ఉన్న అనుబంధాలు ప్రేమలు ఇవన్నీ భారత దేశ రాజకీయాలకు ఒక ప్రోత్సాహవంతమైన భావనగా ఉన్నాయని అంటున్నారు.