'వృథా' రాజకీయాలు.. వైసీపీకి టీడీపీ గట్టి కౌంటర్ ..!
వైసీపీ హయాంలో సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారు. దీనికి రూ.1500 కోట్ల మేరకు ఖర్చు చేశారని కాగ్ వెల్లడించిన నివేదికలోనే పేర్కొంది.;
రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా నిర్వహించడం ద్వారా పెట్టుబడులు సాధించడంతోపాటు.. రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలు కూడా తిలకించేలా చేయాలన్న బృహత్తర ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఒక చక్కని కార్యాచరణను రూపొందించి.. అమలు చేసి సక్సెస్ అయ్యారు. విశాఖలో 3 లక్షల మందితో అంతర్జాతీయ యోగాను నిర్వహించారు. సహజంగా 100 మంది వచ్చే కార్యక్రమానికే నేడు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. అలాంటప్పుడు ప్రపంచ స్థాయి కార్యక్రమం చేసేప్పుడు అందునా.. 5 లక్షల మంది అని టార్గెట్‌పెట్టుకున్నప్పుడు ఈ ఖర్చు కోట్లలోనే ఉంటుంది.
అయితే.. దీనిని తప్పుబడుతూ.. వైసీపీ నాయకులు సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా.. 300 కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంలా ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. అయితే.. సర్కారు మాత్రం అసలు తాము రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని.. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సొమ్ములనే వాడామని వివరణ ఇచ్చింది. అయినా.. వైసీపీ నాయకులు వెనక్కి తగ్గలేదు. దీంతో అసలు వృథా ఖర్చుల విషయంలో గత వైసీపీ ముందా.. ఇప్పుడు కూటమి ముందా? అనేదిచర్చగా మారింది.
వైసీపీ హయాంలో సచివాలయాలకు వైసీపీ రంగులు వేశారు. దీనికి రూ.1500 కోట్ల మేరకు ఖర్చు చేశారని కాగ్ వెల్లడించిన నివేదికలోనే పేర్కొంది. ఇక, దీనిని తప్పుబడుతూ.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పిటిషన్‌లు పడ్డాయి. దీంతో ఆయా కోర్టుల్లో వాద ప్రతివాదాలకు మరో 30 కోట్ల రూపాయల వరకు కోర్టు ఫీజులు, లాయర్ ఫీజుల కింద ఖర్చు చేశారు. చివరకు సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేయడంతో మరో 1500 కోట్ల రూపాయలు ఇచ్చి.. రంగులు తుడిపించారు. మొత్తంగా 3 వేల కోట్ల రూపాయలను వైసీపీ ఖర్చు చేసింది. మరి ఇది వృథా కాదా..? ఆ సొమ్ములు ప్రజల ధనం కాదా? అని టీడీపీ నేతలు క్వశ్చన్ చేస్తున్నారు.
మరో ముఖ్య విషయం.. ల్యాండ్ టైటిల్ చట్టాన్ని తీసుకువచ్చి.. భూముల సర్వే చేశారు. దీనికి గాను.. సరిహద్దు రాళ్లను కొనుగోలు చేశారు. ఇవి అత్యంత ఖరీదైన.. గ్రానైట్ రాళ్లు. పైగా వీటిపై జగన్ బొమ్మలను చిత్రించారు. దీనికిగాను.. 2 వేల కోట్ల వరకు ఖర్చు చేశారు. చివరికి ఇది ఆచరణ సాధ్యం కాలేదు. దీంతో 2 వేల కోట్ల ఖర్చు మాటేంటని ప్రశ్నించారు. ఇక, విశాఖలో రుషికొండపై 500 కోట్ల పైగా సొమ్ముతో రాజమహల్‌ను నిర్మించారు. ఇది ఎందుకూ కొరగాకుండా పోయింది. ఇలా.. చెప్పకొంటూ.. పోతే.. వైసీపీ చేసిన వృథా ఖర్చులు లక్ష కోట్ల వరకు ఉన్నాయన్నది టీడీపీ చెబుతున్న మాట.