మా ఇంట్లో వాళ్లు చెప్పినా వారికి పనిచేయను.. టీడీపీ సీనియర్ నేత యనమల
తుని నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో యనమల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.;
‘‘నేను చాలా స్ట్రిక్టు’’ అంటున్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.ముఖ్యంగా తన వద్ద పనుల కోసం వచ్చే వైసీపీ నేతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొట్టారు. ఎలాంటి మొహమాటం లేకుండా తానీ విషయాన్ని చెబుతున్నానని, రాజకీయ ప్రత్యర్థులకు ఎటువంటి పనిచేయొద్దని తమ పార్టీ కార్యకర్తలకు తేల్చిచెప్పారు.
తుని నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో యనమల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.ముఖ్యమత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేలా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తోందని యనమల విమర్శించారు. ఆ పార్టీ వాళ్లు అడిగారని ఏవైనా పనులు చేసి పెడితే దానివల్ల తెలుగుదేశం పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని యనమల చెప్పారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరు వచ్చి ఏ పని అడిగినా చేయడానికి వీల్లేదని పార్టీ నేతలకు యనమల ఆదేశించారు. ఈ విషయం తాను చాలా గట్టిగా చెబుతున్నానని తెలిపారు. ఈ విషయంలో తన ఇంట్లో వారు చెప్పినా చేయనని తెగేసి చెబుతానని యనమల స్పష్టం చేశారు. అంత కఠినంగా ఉంటేనే పార్టీ బలోపేతమవుతుందని అన్నారు. ఒకసారి చేయనని గట్టిగా చెబితే చెయ్యనని గట్టిగా చెబితే మళ్లీ రెండో సారి వాళలు పనుల కోసం రాబోరని, ఒకసారి చేసిపెడితే వస్తూనే ఉంటారని వ్యాఖ్యానించారు.
వైసీపీ నాయకులు గాని, కార్యకర్తలు గాని తమ పార్టీలో చేరతామంటేనే వాళ్లకు పనులు చేసే విషయం ఆలోచించించాలని యనమల సూచించారు. ఎవరు పడితే వాళ్లు పార్టీలోకి వస్తామంటే చేర్చుకోబోమని వాళ్ల క్యారెక్టర్ ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆధారంగానే చేర్చుకుంటామని పేర్కొన్నారు.