సూపర్ సిక్స్ లో బ్రహ్మాస్త్రాన్ని తీస్తున్న బాబు
ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చినా వాటి అమలులో సరిగ్గా చేయరని బాబు మీద ఒక విమర్శ ఉంది. అదే ఆయనకు మరుసటి ఎన్నికల్లో ఓటమికి కూడా కారణం అవుతోంది.;
ఈసారి అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు వైఖరిలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఆయన ఎపుడూ సంక్షేమ పధకాల విషయంలో పరిమితమైన స్థాయిలోనే ఆలోచిస్తారు. వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరు. ఎన్నికల్లో హామీలు చాలా ఇచ్చినా వాటి అమలులో సరిగ్గా చేయరని బాబు మీద ఒక విమర్శ ఉంది. అదే ఆయనకు మరుసటి ఎన్నికల్లో ఓటమికి కూడా కారణం అవుతోంది.
అయితే ఈసారి అధికారంలోకి రావడంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా విశేష ప్రధాన్యత ఇస్తున్నారు. తాను అభివృద్ధి చేస్తే అది ఒక్కటే వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సరిపోదని బాబు ఆలోచిస్తున్నారులా ఉంది అని అంటున్నారు. పైగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలీ అంటే ప్రధాన ఆయుధం సంక్షేమ పధకాలే అని కూడా యోచిస్తున్నారు. ఎక్కడ వాటిని అమలు చేయకపోయినా వైసీపీ దానిని పొలిటికల్ అడ్వాన్స్ గా తీసుకుని మరీ ఎన్నికలలో వాడుకుంటుందని భావిస్తున్నారు.
అందుకే వైసీపీకి చాన్స్ ఇవ్వకుండా సూపర్ సిక్స్ పధకాలను ఒక్కో దానినీ పూర్తిగా అమలు చేయడానికే చూస్తున్నారు. తల్లికి వందనం బాబు బాగానే అమలు చేశారు. దాంతో పెద్ద ఎత్తున ఈ విషయంలో తల్లులలో సంతృప్తి వ్యక్తం అయింది. పైగా ఈ పధకం వివిధ కారణాల వల్ల అందని వారి కోసం ఫిర్యాదులు తీసుకుంటున్నారు. అలా మరోసారి పరిశీలించి దాదాపుగా అందరికీ ఈ పధకం వర్తించేలా చూస్తున్నారు
ఇక అన్న దాతా సుఖీభవ పధకాన్ని కూడా త్వరలో అమలు చేయబోతున్న్నారు. ఏకంగా 45 లక్షలకు పైగా రైతులకు దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం సమకూరనుంది. ఇంకో వైపు సుపరిపాలనకు తొలి అడుగు సభలో బాబు మహిళల కోసం మరో పధకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తామని బాబు ప్రకటించారు.
దాంతో పాటు ఆటో డ్రైవర్లను ఆర్ధికంగా ఆదుకోవడం కోసం పధకం అమలు చేస్తున్నారు. ఇపుడు నిరుద్యోగ యువత కోసం మరో పధకాన్ని అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. టీడీపీ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటంటే ఉద్యోగం అయినా ఇస్తామని లేదా నెలకు మూడు వేల భృతి ఇస్తామని. దాని ప్రకారం చూస్తే కనుక ఈ పధకం విధివిధానాలు ప్రస్తుతం ఖరారు చేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని అంటున్నారు.
డిగ్రీ పూర్తి చేసిన మీదట ఒక ఏడాది పాటు ఖాళీగా ఉన్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. వీరి డేటాను తీసుకుంటారు. అలా ఏపీ వ్యాప్తంగా ఎంతమంది అర్హులుగా ఉన్నారు అన్నది చూస్తారని చెబుతున్నారు. అలాగే వీరికి స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ద్వారా శిక్షణ ఇస్తారని అంటున్నారు. ఈ శిక్షణ ఇచ్చే సమయంలో గానే నెలకు మూడు వేల రూపాయలు భృతి కింద ఇస్తారని అంటున్నారు.
దాని వల్ల వారికి స్కిల్స్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని దాంతో వారికి కచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు. ఈ గ్యాప్ లో భృతి ఇస్తే రెండిందాలుగా మేలు జరుగుతుందని అంటున్నారు.ఈ పధకానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. పేదలుగా ఉండాలి. ఇలా నిబంధనలతో దీనిని రూపొందిస్తున్నారు.
ఇక అన్నీ అనుకున్నట్లుగా కుదిరితే కనుక దసరా నుంచి ఈ పధకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చూస్తోంది అని ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే వైసీపీకి నోరెత్తేందుకు కూడా వీలు లేకుండా పోతుంది అని అంటున్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వం రెండు వైపులా పదునైన కత్తి మాదిరిగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమాన్ని అమలు చేయాలని చూస్తోంది. దీని వల్ల అత్యధిక శాతం ప్రజలు కూటమికి మద్దతుగా ఉంటారని అంచనా వేస్తున్నారు.