కూటమి ఎమ్మెల్యేల పరిస్థితి పొలిటికల్ గా కోమాలోకి వెళ్ళినట్లే !

ఆ పార్టీ ద్వారా అందలాలు అందుకున్న వారు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు.;

Update: 2025-05-23 14:32 GMT

తెలుగుదేశం పార్టీ ఘనమైనది సుదీర్ఘమైన చరిత్ర కలిగినది ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంటే ఆ లెవెలే వేరుగా ఉంటుంది. ఇక దర్జాకు దర్జా అధికారానికి అధికారం తో ఎవరికి వారుగా సామంతరాజు గా వెలిగిన కాలం చాలా ఉంది. తెలుగుదేశం పార్టీని అందుకే సీనియర్లు అట్టే బెట్టుకుని ఉంటారు.

ఆ పార్టీ ద్వారా అందలాలు అందుకున్న వారు దశాబ్దాలుగా కొనసాగుతున్నారు. టీడీపీ కూడా ఎపుడూ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న వారికి విలువ ఇస్తూ వారికి అవకాశాలు ఇస్తూ ఎప్పటికపుడు ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇక చూస్తే కనుక కూటమిని కట్టింది టీడీపీ. మూడు పార్టీలూ కలసి ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపించాయి.

కూటమిలో చూస్తే పెద్దన్నగా టీడీపీ ఉంది. అయితే గతానికి ఇపుడు చాలా భిన్నమైన పరిస్థితి మాత్రం రాజకీయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి పొత్తులు ఎత్తులూ కొత్త కాదు. కానీ ఎపుడూ పైచేయిగా టీడీపీదే ఉంటూ వస్తోంది. టీడీపీ పొత్తు పార్టీలను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతోంది.

అధికారంలోకి వచ్చేంతవరకే అన్నట్లుగా వారిని చాలా పరిమితం చేసింది. ఫలితంగా టీడీపీకి పొత్తు లాభాలు చాలా ఉండేవి. మిత్రులు మాత్రం టీడీపీకి అధికార అందలాలు అందించే నిచ్చెనలుగా మారిపోయారు. మరో వైపు చూస్తే కనుక టీడీపీ అధికారం రాజకీయంగా అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలతో జత కట్టి 2024లో అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి పొత్తుల కధ వేరేగా సాగుతోంది. పదవుల విషయంలో మిత్రులు కూడా బాగానే వాటాలు అందుకుంటున్నారు రాజ్యసభ సీట్లు అయితే ఇప్పటికి రెండు బీజేపీ తీసుకుంది. మంత్రి పదవి ఒకటి, ఎమ్మెల్సీ ఒకటి దక్కించుకుంది. జనసేన రెండు ఎమ్మెల్సీలను తీసుకుంది. మూడు మంత్రి పదవులు తీసుకుంది. నామినేటెడ్ పదవులలో కీలకమైన వాటిని అందుకుంది.

ఇలా చూస్తే కనుక ఈసారి మిత్రులు ముందు చూపుతోనే ఉంటున్నారు. టీడీపీతో పాటుగా తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకుంటున్నారు దీంతో పదవుల వద్ద టీడీపీ తమ్ముళ్ళు ఇబ్బంది పడుతున్నారు టీడీపీ పెద్ద పార్టీ. ఆ పార్టీ తమ్ముళ్లకు మిత్రుల కారణంగా న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది.

దీంతో చాలా మంది సీనియర్లు గుస్సా అవుతున్నారు. ఇదే విషయం పార్టీలో చర్చగా ఉన్నా బాహాటంగా చెప్పిన వారు మాత్రం మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ. ఆయన తాజాగా మహనాడులో మాట్లాడుతూ ఈసారి పొత్తుల వల్ల టీడీపీ దెబ్బ తినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వారికి అవకాశాలు ఏ మాత్రం దక్కడం లేదు అని ఆయన చెప్పుకొచ్చారు ఇలా అయితే ఒకనాటి కమ్యూనిస్టుల పరిస్థితే టీడీపీకి ఏర్పడుతుంది అని ఆయన అంటున్నారు.

గతంలో తెలివిగా వామపక్షాలను టీడీపీ నిర్వీర్యం చేసింది, కానీ బీజేపీ జనసేనతో టీడీపీ నిర్వీర్యం అయ్యే సీన్ కనిపిస్తోంది అని ఆయన అంటున్నారు. మరో సీనియర్ ఎమ్మెల్యే మాడుగులకు చెందిన బండారు సత్యనారాయణమూర్తి అయితే ఏడాది పాలనలో ప్రజలకు ఏమీ చేయలేకపోయామని అన్నారు అందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. నిధుల విషయంలో కూడా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కోలా కేటాయిస్తూ వివక్ష చూపిస్తున్నారు అని అన్నారు. అభివృద్ధి విషయంలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని బండారు విచారం వ్యక్తం చేస్తున్నారు.

మరో సీనియర్ ఎమ్మెల్యే కర్నూలు జిల్లాకు చెందిన కేఈ ప్రభాకర్ అయితే తమ పార్టీకే చెందిన మంత్రి టీజీ భరత్ మీద నిప్పులు చెరుగుతున్నారు. మంత్రి టీజీ భరత్ వ్యవహార శైలి ఏ మాత్రం బాగా లేదని ఆయన ఆక్షేపిస్తున్నారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్తే ఆధార్ కార్డులు చూసి పనులు చేయడమేంటి అని మండిపడ్డారు. ఇక మంత్రి గారికి ఆయన రెండు నెలలు టైం ఇచ్చి డెడ్ లైన్ పెట్టేశారు. పద్ధతి మార్చుకోకపోతే మాత్రం తానే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాను అని అంటున్నారు.

ఇలా చూస్తే కనుక కూటమి పాలన మీద టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలే ద్వజమెత్తుతున్నారు. పార్టీలో అవకాశాలు దక్కక మిత్రులకు వాటాలు ఇవ్వడం పైన గుర్రు అవుతున్నారు అలాగే మంత్రి పదవులు దక్కలేదని మధనపడుతున్నారు. సీనియర్లను పక్కన పెడుతున్నారు అని వేదన చెందుతున్నారు. దాంతో కూటమి పాలనలో ఎమ్మెల్యేల పరిస్థితి మరీ ఇలా ఉందా అన్న చర్చ వస్తోంది. ఇదే తీరున సాగితే వచ్చే ఎన్నికల నాటికి పొలిటికల్ గా కోమా స్టేజిలోకి అంతా వెళ్తారని అంటున్నారు. చూడాలి మరి వారి వ్యధలు కధలు విన్న అధినాయక్త్వం ఏమైనా సర్దుబాటు చేస్తుందో ఏమిటో.

Tags:    

Similar News