వల్లభనేని వంశీ అనుచరుడు అరెస్టు.. ఏ కేసులో అంటే?

తాజాగా క్రిష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.;

Update: 2025-12-05 04:24 GMT

సంచలనంగా మారిన కేసులో వల్లభనేని వంశీ అనుచరుడిగా పేరున్న యర్రంశెట్టి రామాంజనేయులు అలియాస్ పొట్టి రామును పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన ఉదంతంపై సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయటం.. బెదిరింపులకు పాల్పడటం.. కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి చేసిన ఉదంతంలో రామాంజనేయులు కీలక భూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన కేసులో అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో రామాంజనేయులు ఏ9గా ఉన్నారు. వైసీపీ హయాంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. పలు దందాలకు పాల్పడినట్లుగా చెబుతారు. వివాదాల్లో ఉండే ఆస్తుల్ని తక్కువ ధరకు సొంతం చేసుకోవటం.. సంక్రాంతి సమయంలో నిర్వహించిన కాసినోలోనూ కీలక భూమిక పోషించినట్లుగా పేరుంది.

పలు ఆరోపణలున్న రామాంజనేయులు గడిచిన పది నెలలుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా క్రిష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలోని ఆయన ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తనపై పెట్టిన కేసుల్లో అరెస్టు కాకుండా ఉండేందుకు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లు రిజెక్టు అయ్యాయి. తాజాగా అదుపులోకి తీసుకున్న అతడ్ని విచారించి.. ఈ రోజు కోర్టు ఎదుట హాజరుపరుస్తారని చెబుతున్నారు.

టీడీపీ కార్యాలయం దాడి ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేయటం.. బెదిరింపులకు పాల్పడిన ఉదంతం ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకుంది. తొలుత హనుమాన్ జంక్షన్ కు తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడిన అతను.. వాంగ్మూల పత్రాలపై సంతకాలు తీసుకున్నాడు.

తర్వాతి రోజు బాధితుడ్ని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తీసుకెళ్లి.. ఈ కేసుకు తనకు సంబంధం లేదని.. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని అతనితో న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలాన్ని ఇప్్పించాడు. అనంతరం సత్యవర్ధన్ ను హైదరాబాద్ కు తీసుకెళ్లి.. అక్కడి మైహోం బూజాలో వంశీ ఎదుట కల్పించారు. ఆ రాత్రి అక్కడే ఉంచి బెదిరింపులకు పాల్పడి.. 11న కారులో మిగిలిన నిందితులతో కలిసి విశాఖకు తీసుకెళ్లిన వైనం తెలిసిందే.

Tags:    

Similar News